తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌

CM Jagan Review : ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌

HT Telugu Desk HT Telugu

13 July 2022, 18:20 IST

google News
    • ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచి, ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ పైనా అధికారులతో మాట్లాడారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎంం జగన్ ఆదేశించారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామని అధికారులు చెప్పారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా ప్రభుత్వం వైద్యం అందిస్తోంది.

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపు చేస్తారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ధృవీకరణ పత్రంలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు.. అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు నమోదు చేయాలి. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుం వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదుల కోసం ఏసీబీకి కేటాయించారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

ఇంకా సీఎం జగన్ ఏం చెప్పారంటే..

రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలి. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలి. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ వాహనాలపైన ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉంచాలి.

కొవిడ్ పైనా సీఎం జగన్ సమీక్షించారు. అక్కడక్కడా కొవిడ్‌ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పమని అధికారులు తెలిపారు. కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామన్నారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు సీఎం. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండో డోసు 99.69 శాతం మందికి ఇచ్చామన్నారు అధికారులు. 12-14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామన్నారు.

ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపై సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ఈ ప్రభుత్వం వచ్చాక భర్తీచేశామన్నారు అధికారులు. జులై చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

తదుపరి వ్యాసం