Jagan In vaakadu: స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి, వారంలో పరిహారం - సిఎం జగన్
08 December 2023, 12:35 IST
- Jagan In vaakadu: తిరుపతిలో మిగ్‌జాం తుఫానుతో నష్టపోయిన ప్రాంతాలను సిఎం జగన్ పరిశీలించారు. స్వర్ణముఖ ఒడ్డున జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాలిరెడ్డి పాలెంలో బాధితులను పరామర‌్శించిన జగన్ వారంలో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
తుఫాను నష్టాన్ని పరిశీలిస్తున్న సిఎం జగన్
Jagan In vaakadu: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటించారు. మిగ్‌జామ్ తుఫానుతో నష్టపోయిన వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంలో సిఎం జగన్ పర్యటించారు. బాలిరెడ్డి పాలెం గ్రామంలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించారు.
తుఫాను బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అంతకు ముందు అధికారుల నుంచి తుఫాను నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారు. మిగ్‌జామ్ తుఫాను పీడకలగా మిగిలిందని ఏడాదిలో కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లో కురిసిందన్నారు.
తీర ప్రాంతంలో 496గ్రామాల్లో కరెంటు పోయిందని, 13వేల హెక్టార్లలో వరి పంట ముంపుకు గురైందని, 6వేల హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు ముంపుకు గురైనట్లు అధికారులు సిఎంకు తెలిపారు. జిల్లాలో 500హెక్టార్లలో అక్వా కల్చర్ నష్టపోయిందన్నారు.
మిగ్‌జాం తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లాలో 40 నుంచి 60 సెంటిమీటర్ల వర్షం కురిసిందని సిఎం తెలిపారు. భారీ వర్షాలతో కురిసిన నష్టం ఎవరు వివరించలేనిదన్నారు. తుఫాను నేపథ్యంలో తిరుపతిలో 92 సహాయ శిబిరాల్లో 82364మంది శిబిరాలకు తరలించినట్టు చెప్పారు. 60వేల మందికి రేషన్ బియ్యం 25కేజీల చొప్పున పంపిణీ చేసినట్టు చెప్పారు. కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు పంపిణీ చేసినట్టు చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని రకాలుగా ప్రభుత్వం సకాలంలో ఆదుకుందని చెప్పారు. ఏ ఒక్కరికి నష్టం జరగదని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. 60వేల కుటుంబాలకు రేషన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి రూ.2500చెల్లిస్తున్నామన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చినా, సామాన్లకు నష్టం జరిగినా, ఇబ్బందులు పడిన వారికి కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పారు. రేషన్ మాదిరే పరిహారం చెల్లింపు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.
పంట నష్టపోయిన వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పంటలు వేసి నష్టపోయిన వారికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. రానున్న నాలుగైదు రోజుల్లో కలెక్టర్లు పరిహారం చెల్లింపు పూర్తి చేస్తామన్నారు.
కరెంటును వేగంగా పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ఇంకా కరెంటు పునరుద్దరించని గ్రామాల్లో వేగంగా పునరుద్దరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మిగ్‌జామ్ తుఫానుతో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
స్వర్ణముఖిపై హైలెవల్ వంతెన
స్వర్ణముఖి ముంపుకు శాశ్వత పరిష్కారం చూపేలా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. రూ.30కోట్ల రుపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తూ దానిని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని, చెడు జరగదని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రావాల్సింది ఎక్కడైనా రాకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేస్తే తనకు సమాచారం తెలిసి పోతుందన్నారు.