తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Gorumudda Scheme : మీ మేనమామగా ఆలోచిస్తున్నా.. మార్పులు తీసుకొస్తున్నాం

Jagananna Gorumudda Scheme : మీ మేనమామగా ఆలోచిస్తున్నా.. మార్పులు తీసుకొస్తున్నాం

HT Telugu Desk HT Telugu

21 March 2023, 14:40 IST

google News
  • Jagananna Gorumudda Scheme : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాగిజావ అందించే పథకాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

పథకం ప్రారంబిస్తున్న సీఎం జగన్
పథకం ప్రారంబిస్తున్న సీఎం జగన్

పథకం ప్రారంబిస్తున్న సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి బడులలో సదుపాయాలు మెరుగుపర్చడం ఎలా ? బడి పిల్లల మేథో వికాసానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం ఎలా ? పెద్ద చదువులను చదివించడానికి ప్రోత్సహించడమెలా? అని ఆలోచిస్తున్నామన్నారు.

ఉన్నత విద్యలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తూ... జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. ఇంటర్నషిప్‌ను తప్పనిసరిచేస్తూ.. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ని కరిక్యులమ్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి అడుగులోనూ మన పిల్లలందరికీ ప్రపంచంతో పోటీపడేలా వాళ్లు అక్కడ నెగ్గేలా ప్రతి అడుగు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే విద్యాకానుక అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు.

సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..

గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నాం. గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో అమలు చేస్తున్నాం. ఇందులో ఇవ్వాళ్టి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తూ.. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ జాగిజావ వల్ల పిల్లలకు ఐరన్, కాల్షియం కంటెంట్‌ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

1 నుంచి 10 తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,392 స్కూళ్లలో ఉన్న దాదాపు 38లక్షల మంది పిల్లలకు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి. గతంలో మిడ్‌ డే మీల్స్‌ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. వండిపెట్టే ఆయాలకు రూ.1000 ఇస్తూ.. అది కూడా 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి ఉండేది. చివరకు సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే క్వాలిటీ అనేది ఉండదు.

అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనుతో పూర్తిగా మార్చి... ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గతంలో రూ.450 కోట్లు ఉన్న బడ్జెట్‌ నుంచి ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు గోరుముద్ద అనే కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాం. ఇందులో రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నాం.

ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారు. పిల్లల మెనూ ఏంటి ? అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. పిల్లల మెనూ కోసం ఒక ముఖ్యమంత్రి ఇంతలా ఆలోచన చేసిన పరిస్ధితులు దేశచరిత్రలో ఉండవేమో ? పిల్లలకు మంచి మేనమామలా, పిల్లల తల్లులకు మంచి అన్నలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ రాగిజావ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం నిజంగా మంచి పరిణామం.

శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను. దాదాపుగా రూ.86 కోట్లు సంవత్సరానికి ఖర్చయ్యే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్‌ నుంచి దాదాపు రూ.42 కోట్లు కంట్రిబ్యూట్‌ చేస్తుంటే... మిగిలిన రూ.44 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నాం. సత్యసాయి ట్రస్ట్‌ వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఏప్రిల్‌లో పదోతరగతితో పాటు మిగిలిన పిల్లలకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో... పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా మీ మేనమామ తరపున ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

తదుపరి వ్యాసం