ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ప్లాంట్…. కర్నూలు జిల్లాలో శంకుస్థాపన
17 May 2022, 13:01 IST
- కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోన్న భారీ సోలార్-హైడల్-విండ్ పవర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు, 550 మెగావాట్ల విండ్ పవర్, 1860 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
కర్నూలు జిల్లాలో అతిపెద్ద పవర్ ప్లాంట్ శంకుస్థాపనలో సీఎం జగన్మోహన్ రెడ్డి
ప్రపంచంలోనే తొలి సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్‌కో ఎనర్జీ ఏర్పాటు చేసిన ప్లాంటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
గ్రీన్‌కో ప్రాజెక్టు ద్వారా మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఓరక్వల్లు పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కామ్‌లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి.
సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో విద్యుతుత్పత్తి చేస్తారు. హైడల్ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే ఇక్కడ మాత్రం కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు.
ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన అవసరాలు తీరేలా గ్రీన్ కో విద్యుత్ త్వరితగతిన విద్యుత్ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి అకాంక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. కర్బన ఉద్ఘారాలను తగ్గించేలా పర్యావరణ హితమైన పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు.
టాపిక్