Annamayya District : సీఐ తల్లిని హత్య చేసి.. బంగారు ఆభరణాలతో పరారీ! ఇలా దొరికిపోయారు
09 October 2024, 12:15 IST
- అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ కుటుంబం నమ్మించి హత్య చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వృద్ధురాలి కొడుకు ధర్మవరం వన్‌టౌన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఐ తల్లి హత్య...! బంగారు ఆభరణాలతో పరార్
అన్నమయ్య జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కాశీ నుంచి స్వామిజీ వచ్చారని, మీ ఆరోగ్య సమస్యలు తీరుస్తారని సీఐ తల్లిని నమ్మించి ఒక వ్యక్తి తీసుకెళ్లాడు. ఆమెను హతమార్చి, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. బాధితురాలు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఒకటో పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి (62) కావడంతో స్థానికంగా సంచలనం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని బెంగళూరులో పట్టుకున్న పోలీసులు…. మదనపల్లికి తీసుకొచ్చారు.
ఏం జరిగిందంటే…!
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి మదనపల్లెలో దేవళం వీధిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆమె 30 ఏళ్ల క్రితమే తన భర్త శ్రీరాములతో విడిపోయారు. మేడికుర్తికి చెందిన యల్లమ్మ, సురేంద్ర కుటుంబం కూడా స్వర్ణకుమారి ఇంటికి సమీపంలోనే నివసిస్తూ ఆమెకు చేదోడువాదోడుగా ఉండేది.
సొంతూరికే చెందిన వారు కావడంతో యల్లమ్మతో స్వర్ణకుమారి స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పని చేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లి వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయితే స్వర్ణకుమారి ఆరోగ్య సమస్యలు, కుటుంబ వ్యవహారాలు వెంకటేష్‌కు తెలుసు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వెంకటేష్, స్వర్ణ కుమారి బంగారు ఆభరణాలపై కన్నేశాడు. ఏలాగైన ఆమె వద్ద నున్న బంగారు ఆభరణాలు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కోసం ప్రణాళిక రూపొందించాడు.
ప్రణాళిక ప్రకారమే కాశీ నుంచి స్వామీజీ వచ్చారని, ఆయన మంత్రంతో మీ అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమవుతాయని స్వర్ణ కుమారిని వెంకటేష్ నమ్మబలికాడు. తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న వెంకటేష్ తన అనారోగ్య సమస్యలు నయం కావాలని, తన క్షేమం కోసమే చెబుతున్నాడని భావించింది స్వర్ణకుమారి. వెంకటేష్ మాయ మాటలను నమ్మేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ఆమెను మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో ఉన్న అనిల్ ఇంటికి తీసుకెళ్లాడు. తీర్థంలో నిద్రమాత్రలు కలిపి తాగించాడు.
దీంతో స్వర్ణకుమారి స్పృహ కోల్పోగానే ఆమె తలపై సుత్తి గట్టిగా కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ తీసుకున్నాడు. ఆ తరువాత అనిల్ సాయంతో స్వర్ణకుమారి మృతదేహాన్ని అయోధ్యనగర్ శ్మశానవాటికకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అనంతరం దోచుకున్న బంగారు ఆభరణాలు ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.4.30 లక్షలకు తాకట్టు పెట్టాడు. సెప్టెంబర్ 30న బెంగళూరుకు పారిపోయాడు.
అయితే సీఐ నాగేంద్ర ప్రసాద్ తన తల్లి ఫోన్ చేసినా ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో ఆమె పరిసర ప్రాంతాల వారికి ఫోన్ చేసి అడిగితే.. ఆమె కనిపించటం లేదని అన్నారు. దీంతో సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు అనుమానం వచ్చింది. తల్లి కనిపించటం లేదని సమాచారంతో సీఐ నాగేంద్రప్రసాద్ మదనపల్లెకు వచ్చారు.
మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్‌లో తన తల్లి కపించలేదని ఆయన ఫిర్యాదు చేశాడు. వెంకటేష్‌పై అనుమానంతో ఆరా తీయగా, బెంగళూరులో ఉన్నాడని తెలిసింది. దీంతో బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మదనపల్లెకు తీసుకెళ్లారు.
మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని నిందితుడు పోలీసులకు చూపించాడు. దీంతో మృతదేశాన్ని పోలీసులు వెలికి తీసి, పోస్టుమార్టం నిర్వహించారు. మరో నిందితుడు అనిల్ పరారీలో ఉన్నాడు. దీంతో ఆయన తల్లి రమాదేవి పాత్ర కూడా ఉందని అనుమానంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.