Payyavula Keshav: ముందు సలహాదారుల్ని మార్చుకో, జగన్ ప్రతిపక్ష నేత కాదు ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్న పయ్యావుల కేశవ్
26 June 2024, 14:05 IST
- Payyavula Keshav: వైసీపీ అధ్యక్షుడు మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కాదని కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. స్పీకర్ రాయమని జగన్‌కు సలహా ఇచ్చిన వారిని ముందు మార్చాలని కేశవ్ సూచించారు.
జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని స్పష్టం చేసిన పయ్యావుల కేశవ్
Payyavula Keshav: ఏపీ శాసన సభలో అన్ని పార్టీల తరహాలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్లోర్ లీడర్‌గానే పరిగణిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి కేశవ్ స్పష్టం చేశారు. తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కావాలని జగన్ స్పీకర్‌కు లేఖ రాయడాన్ని పయ్యావుల తప్పు పట్టారు. 1994 నుంచి తాను శాసనసభ్యుడిగా ఉన్నానని అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సిఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న సమయంలో ఎంపీగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వచ్చారో, పిజెఆర్ విషయంలో ఏమి జరిగిందో కూడా తనకు గుర్తుందన్నారు. చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. జగన్‌కు స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించిన సలహాదారుల్ని మార్చాలని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఉన్న నిభందనలు ప్రకారం జగన్ కూ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని పయ్యావుల చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్ కు ఓ పదేళ్లు పడుతుందన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టిందని, 2014, 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని, పదేళ్ల తర్వాత వచ్చిందని గుర్తు చేశారు. జగన్‌కు కూడా ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆప్తుడైన కేసిఆర్ కూడా తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగించి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారన్నారు. తాము అలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయమన్నారు.
స్పీకర్‌కు లేఖ రాయడం ద్వారా జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని, జగన్ తన ఖాతా పుస్తకాలతో పాటు శాసనసభ నిబంధనలు కూడా చదవాలన్నారు. సభలో అధికార పార్టీ చాలా హుందాగానే వ్యవహరించిందని, ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ ఇంకా గుర్తించలేనట్టుందని, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు. అధికార పార్టీగా హుందాగానే స్పందించి ప్రమాణాన్ని మంత్రులతో పాటు చెయ్యించామన్నారు.
ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ ఏ సలహాదారు సూచనల మేరకు రాశారని పయ్యావుల ప్రశ్నించారు. అలాంటి సలహాదారుల సలహాలు తీసుకుంటే మునిగి పోతారని జగన్ గుర్తించాలన్నారు. జగన్ కేవలం మద్యం , ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు శాసన సభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ శఖ్డర్ పుస్తకాలు చదవాలన్నారు.
వైసిపికి సభలో ప్రతిపక్ష హోదా లేదని అందుకే జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదని స్పష్టం చేశారుర. ఆయన కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, ఓనమాలు కూడా చూడకుండా ఈ లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని శాసన సభ లు, పార్లమెంటు పాటించే నిబంధనలు జగన్ తెలుసుకోవాలని కోరుతున్నామన్నారు.
ప్రతిపక్ష హోదా ఎవరికీ ఇవ్వాలన్న దానిపై తొలి స్పీకర్ మల్వంకర్ నిర్దేశించారని, 10 శాతం కూడా సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుందన్నారు. గత శాసన సభ లో జగన్ తన నోటితోనే చెప్పారని, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే జులుం చేద్దామని ఆయన ఉద్దేశంలా ఉందన్నారు.