తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Delhi Residence: ఎట్టకేలకు ఆ ఇంట్లోకి బాబు .. ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో నేడు సిఎం పూజలు

CBN Delhi Residence: ఎట్టకేలకు ఆ ఇంట్లోకి బాబు .. ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో నేడు సిఎం పూజలు

Sarath chandra.B HT Telugu

17 July 2024, 9:24 IST

google News
    • CBN Delhi Residence: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అడుగు పెట్టనున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితమే ఢిల్లీలో ముఖ్యమంత్రికి అధికారిక నివాసాన్ని కేటాయించినా బాబు గతంలో ఆ ఇంట్లొ బస చేయలేదు.
నేడు ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో పూజలు చేయనున్న సిఎం చంద్రబాబు
నేడు ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో పూజలు చేయనున్న సిఎం చంద్రబాబు

నేడు ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో పూజలు చేయనున్న సిఎం చంద్రబాబు

CBN Delhi Residence: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో చంద్రబాబు అడుగు పెడుతున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితమే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం నివాసం కోసం కేంద్రం కేటాయించిన 1 జన్‌పథ్‌ భవనంలోకి ముఖ్యమంత్రి హోదాలో బుధవారం బాబు అడుగు పెడుతున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే జన్‌పథ్‌ నివాసాన్ని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం కేటాయించింది.

అప్పట్లో చంద్రబాబుకు కేటాయించిన నివాసం పక్కనే, నంబర్ 2 జన్‌పథ్‌ క్వార్టర్‌లో మాజీ చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ నివాసం ఉండేవారు. 2014-19 మధ్య కాలంలో 1 జన్‌పథ్‌లో సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.5కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చింది. అప్పట్లో పలు కారణాలతో చంద్రబాబు ఈ నివాసంలో ఉండేందుకు ఆసక్తి చూపేవారు కాదు. రాజకీయమైన విమర‌్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయన అధికారిక నివాసంలో బస చేయడానికి సుముఖత చూపేవారు కాదని చెబుతారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రమే ఎప్పుడైనా ఢిల్లీలో పర్యటించినపుడు అందులో బస చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బస చేయడానికి ఢిల్లీలోని అశోకారోడ్డులో ఉన్న ఏపీ భవన్‌ ప్రత్యేక భవనాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఢిల్లీ పర్యటనల్లో ఏపీ భవన్‌ బసను వినియోగించారు. 2014లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఏపీ భవన్‌ లో ఉన్న ముఖ్యమంత్రి బస చేసే బ్లాక్‌లో సదుపాయాలు కల్పించారు. వాస్తురీత్యా కొన్ని మార్పులు చేశారు. అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రికి మరో అధికారిక బసను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత 1జన్‌పథ్‌ నివాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినియోగించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా జన్‌పథ్‌ నివాసాన్ని ఆయన అభిరుచికి అనుగుణంగా మార్చడానికి కొంత ఖర్చు చేశారు. ఏపీ భవన్‌, జన్‌పథ్‌‌లలో ముఖ్యమంత్రి బస సదుపాయాల పేరిట కోట్ల రుపాయలు వెచ్చించారు.

ఇప్పటి వరకు అక్కడే…

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేస్తున్నారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన గతంలో ఎంఎస్‌ ఫ్లాట్స్‌లో నివాసం ఉండేవారు.

ఆ తర్వాత ఆ‍యన అశోకా రోడ్డులోని 50వ నంబర్ క్వార్టర్‌కు మారారు. రామ్మోహన్ నాయుడు ఉంటున్న క్వార్టర్‌ గతంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేటాయించారు. ప్రభుత్వ క్వార్టర్‌ను అత్యాధునిక హంగులతో తన అభిరుచికి అనుగుణంగా కోట్ల రుపాయలు వెచ్చించి తీర్చిదిద్దారు. పలు కారణాలతో 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారంపై దృష్టి పెడుతున్నట్టు ప్రకటించారు. గల్లా జయ్‌దేవ్‌ తప్పుకోగానే ఆ క్వార్టర్‌ను రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. కేంద్ర మంత్రి హోదాలో అందులోనే ఆయన బస చేస్తున్నారు.

గత నెలరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినపుడు అందులోనే బస చేశారు. బుధవారం 1 జన్‌పథ్ నివాసంలో పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవసరమైన ఏర్పాట్లను అందులో సిద్ధం చేశారు. రామ్మోహన్‌ నాయుడుకు కేటాయించిన అశోకా రోడ్డులోని 50వ నంబర్ క్వార్టర్‌ను సిఎం అధికారిక నివాసంగా మార్చేందుకు ప్రయత్నాలు చేసినా, భద్రతా కారణాలతో చివరి నిమిషంలో జన్‌పథ్‌  క్వార్టర్‌లోనే కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

కేంద్రం నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో  జన్‌పథ్‌ నివాసాన్నే ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా కొనసాగించేందుకు నిర్ణయించారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఉదయం పదిన్నరకు తిరుగు ప్రయాణం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్మలా సీతారామన్‌తో భేటీ కావాల్సి ఉన్నా  అమిత్‌షాతో జరిపిన చర్చలతోనే సానుకూల స్పందన రావడంతో బాబు తిరుగు ప్రయాణం కానున్నట్టు సమాచారం.

తదుపరి వ్యాసం