Chandrababu: ఇలాగే పుట్టి ఇలాగే పోకూడదు.. సమాజంలో ప్రతి కులం ఆర్ధికంగా ఎదగాలన్న చంద్రబాబు
01 July 2024, 10:07 IST
- Chandrababu: పేదరికంలో పుట్టి పేదరికంలోనే పోకూడదని, సమాజంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేందుకు మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. రెడ్డి, కమ్మ, యాదవ వంటి సామాజిక వర్గాలు వారసత్వంగా వచ్చిన భూమి ద్వారా ఎదిగాయని, అన్ని వర్గాలు ఎదగాలంటే చదువే మార్గమన్నారు.
పెనుమాకలో లబ్దిదారుడి కుటుంబంతో మాట్లాడుతున్న చంద్రబాబు
Chandrababu: సమాజంలో పేదరిక నిర్మూలన కోసం ఏమి చేయాలనే దానిపైనే నిరంతరం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాాయుడు చెప్పారు. మంగళగిరి నియోజక వర్గంలోని పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలలోని లబ్దిదారుడి ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారితో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న పూరింట్లో ఉంటున్న వారికి ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెనుమాక గ్రామానికి ఉదయం ఆరింటికే చంద్రబాబు చేరుకున్నారు. ఎస్సీ కాలనీలో ఉన్న ఇస్లావత్ సాయి కుటుంబానికి వెళ్లి వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ‌్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్లు అందుకున్న ఇస్లావత్ సాయి దినసరి కార్మికురాలిగా పనిచేస్తున్నారు. వారి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇంటర్, మరొకరు స్థానిక స్థానిక జడ్పీ స్కూల్లో చదువుతున్నారు. మరో లబ్దిదారుడు బాణావత్ పాములు నాయక్ కూడా దినసరి కార్మికుడిగా ఉన్నారు. మూడున్నర సెంట్ల స్థలం ఉంది. మూడో లబ్దిదారురాలు బాణావత్ సీతకు సిఆర్‌డిఏ పరిధిలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్ చెల్లించారు.
లబ్దిదారులకు పెన్షన్లు చెల్లించిన తర్వాత ముఖ్యమంత్రి వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందచేశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందించే సాయంతో పాటు మరికొంత అదనంగా సంపాదించుకునే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
ఎయిమ్స్‌కు వెళ్లండి….
వైద్య చికిత్స కోసం ప్రతి నెల భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌కు వెళ్లాలని , బయట డాక్టర్ల కంటే పెద్ద డాక్టర్లు అక్కడ ఉంటారని చంద్రబాబు సూచించారు. పేదలు పేదరికంలో మిగిలిపోకుండా ఆదాయం సంపాదించే మార్గాలు అన్వేషించాలన్నారు. ఆలోచనా విధానం మారాలన్నారు.
గతంలో వ్యవసాయం చేసి నష్టపోయినట్టు లబ్దిదారుడు చంద్రబాబుకు వివరించారు. పెనుమాకలో రెడ్లు, కమ్మ మిగిలిన కులాలు ఎందుకు బాగున్నాయి మిగిలిన కులాలు ఎందుకు వెనుకబడిపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యవసాయం చేసి తాము నష్టపోయామని వారు చెప్పగా ఆ కులాలకు వారసత్వంగా వచ్చిన సొంత భూములతో ఎదిగాయని, మిగిలిన కులాలు చదువుపై దృష్టి పెట్టాలని బాబు సూచించారు.
అయా కులాల్లో వారసత్వంగా పొలాలు రావడం వల్ల వ్యవసాయం చేసినా చేయకపోయినా బాగుంటున్నారని, మిగిలిన కులాలు చదువు ద్వారా ఎదగాలని సూచించారు. చదువుకోకపోతే ఇలాగే బతికి చివరకు ఇలాగే చనిపోవాల్సి వస్తుందని సూచించారు. పిల్లల్ని బాగా చదివించాలని సూచించారు. సాయి కుటుంబంలో ఉన్న చిన్నారుల్ని ఏమి చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. వర్షానికి కారిపోతున్న ఇంటిని ఎందుకు బాగు చేయించలేదని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందచేశారు.
ఓడినా మంగళగిరిని లోకేష్ వదిలేయలేదు…
మంగళగిరిలో మొదటి కార్యక్రమం ప్రారంభించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా నారా లోకేష్ వదిలేయలేదన్నారు. మంగళగిరి, గాజువాక,భీమిలీ వంటి నియోజక వర్గాల్లో ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో 95వేల మెజార్టీ రావడం అంటే మాటలు కాదన్నారు. ఐదేళ్ల పాలన పీడకలగా మారడంతోనే ప్రజలు ఇంతటి విజయాన్ని అందించారన్నారు. మొన్నటి వరకు పోలీసులు గోడలు దూకి వచ్చేవారని, ఇకపై వారికి ఆ అవసరం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు గౌరవంగా బతికే రోజులు వచ్చాయన్నారు.
అద్భుతాలు వెంటనే జరగవు..
ఐదేళ్ల బాధల తర్వాత అద్భుతాలు కూడా అప్పటికప్పుడు వెంటనే జరిగిపోవన్నారు. వ్యవస్థలు ఎక్కడున్నాయో, అప్పులు ఎంత ఉన్నాయో తనకు కూడా తెలియదన్నారు. పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదని, రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందన్నారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాలన సాగిందన్నారు. ఇప్పుడు తనపై చాలా భారం పడిందన్నారు. మొన్నటి వరకు పరదాలు కట్టి నడిచేవారని, దాస్తే దాగదని, మురికి కాల్వలకు పరదాలు కట్టి పర్యటించడం ఏమిటన్నారు.
ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వద్దంటే ముసలి వాళ్లను పంచాయితీల చుట్టూ తిప్పి, పెన్షన్ల కోసం వారిని ఎండల్లో తిప్పి 33 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. సచివాలయాల్లో 1.25వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారని, వారితోనే ఒక్కరోజులోనే పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.
పెన్షన్ల పంపిణీ విషయంలో వారు చేసిన మోసం ఏమిటో ప్రజలు గుర్తించాలన్నారు. మాట్లాడితే అబద్దాలు చెప్పారు. ఐదేళ్లు అబద్దాలతో బతికారని, ఇప్పుడు కూడా అదే చేయాలని చేస్తున్నారన్నారు. వారిని శాశ్వతంగా భూ సమాధి చేసే బాధ్యత టీడీపీ, ఎన్డీఏ తీసుకుంటుందన్నారు. చరిత్రలో ఇంత తక్కువ సీట్లు ఏ పార్టీకి రాలేదని అందుకే తాము ఎప్పటికీ సేవకులుగా ఉంటామే తప్ప పెత్తందారులుగా ఉండమన్నారు.
పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు కానుంది. పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు నేడు పంపిణీ చేస్తున్నారు. గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు ఖర్చు కానుంది.
గత ప్రభుత్వంలో పింఛను కోసం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం మరో రూ.819 అదనంగా కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.