CBN Oath Ceremony : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్ - వేదిక ఖరారు, ప్రధాని మోదీ రాక..!
08 June 2024, 5:55 IST
- Chandrababu Swearing in Ceremony : ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం వేదికను కూడా ప్రకటించారు.
జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
Chandrababu Swearing in Ceremony asAP CM : ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముహుర్తం ఫిక్స్ అయింది.
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సభా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తో పాటు మరికొందరు నేతలు కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే కూటమిలోని ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రమాణస్వీకారానికి సంబందించి ఏర్పాట్ల విషయంపై ఏపీ సీఎస్ తో పాటు డీజీపీతో టీడీపీ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లి లోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభా వేదికతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.
భారీ విజయం….
ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసింగే. వైసీపీకేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చూస్తే… తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. బీజేపీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది. పార్లమెంట్ స్థానాల్లో చూస్తే… టీడీపీ 16 ఎంపీ స్థానాలు, వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది.
16 ఎంపీలను గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలోనూ కీలకంగా మారింది. అధిక ఎంపీలను సాధించిన రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. దీంతో ఏపీకి సంబందించి పలు కీలక అంశాలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
టీడీపీకి మెజార్టీ ఎంపీ సీట్లు రావటంతో… కేంద్రంలోనూ మంత్రివర్గంలో స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. రెండు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. వీటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
జూన్ 9న మోదీ ప్రమాణస్వీకారం….
మరోవపైు నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాధించిన ఘనతను సమం చేస్తూ 73 ఏళ్ల మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మూడోసారి ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చారని రాష్ట్రపతిని కలిసిన అనంతరం మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత రెండు దఫాలుగా దేశం ఎంత వేగంగా ముందుకు సాగిందో, అంతకుమించిన వేగంతో ప్రగతి సాధిస్తామన్నారు. ఈ 10 ఏళ్లలో ప్రతి రంగంలోనూ సానుకూల మార్పు కనిపిస్తోందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
మోదీ ప్రమాణస్వీకార వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.