తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandra Babu Letter: జైల్లో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన

Chandra babu Letter: జైల్లో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన

Sarath chandra.B HT Telugu

27 October 2023, 13:23 IST

google News
    • Chandra babu Letter to Judge: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు. 
ఏసీబీ జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు చంద్రబాబు
ఏసీబీ జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు చంద్రబాబు

ఏసీబీ జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు చంద్రబాబు

Chandra babu Letter to Judge: జైల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రాతపూర్వకంగా జైలర్ ద్వారా తెలియ చేయాలన్న ఏసీబీ కోర్టు జడ్జి సూచనల మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖను రాశారు. జైల్లో భద్రతతో పాటు, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు.

జైల్లో తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని, ఇప్పటి వరకు మావోయిస్టుల లేఖపై పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.

హతమార్చేందుకు ప్రయత్నాలు….

విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు వచ్చినప్పుడు తనను అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఫోటోలు, వీడియో ఫుటేజీని పోలీసులే లీక్‌ చేశారని తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజీని రిలీజ్‌ చేశారని ఆరోపించారు.

జైల్లోకి వెళుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని తన భద్రతపై ఉన్న ఆందోళనను గాలి కొదిలేశారని బాబు ఆరోపించారు. తన ప్రాణాలకు హాని ఉందని ఎస్పీకి అజ్ఞాత లేఖ వచ్చిందని, వామపక్ష తీవ్రవాదులు హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు లేఖలో ఉందని, నన్ను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసిందని బాబు పేర్కొన్నారు. అజ్ఞాత లేఖపై పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదని అనుకోని ఘటన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు.

పెన్‌ కెమెరాతో డ్రగ్స్‌ కేసు నిందితుడు..

జైల్లో డ్రగ్స్‌ కేసు నిందితుడు ఒకరు పెన్‌ కెమెరాతో తిరుగుతున్నాడని ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడని ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగుర వేయడం ద్వరా కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్‌ వాడారని పేర్కొన్నారు. ములాఖత్‌లో కలిసిన వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఎగురవేశారని ఆరోపించారు. తనతో పాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైసీపీకి చెందిన వారేనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోలేదని. డ్రోన్‌ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించ లేదన్నారు. ఇది జైలు అధికారుల నిస్సహాయతకు నిదర్శనమన్నారు.

కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసురుతుంటే గార్డెనింగ్‌ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారన్నారు. రాజమహేంద్రవరం జైల్లో మొత్తం 2,200 మంది ఖైదీలు ఉన్నారని వారిలో 750 మంది డ్రగ్స్‌ కేసు నిందితులని తెలిపారు. కొంతమంది ఖైదీల వల్ల తన భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో ఉన్న నా భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చిందని నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని బాబు ఆఱోపించారు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారని తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నానని చెప్పారు.

నాలుగున్నరేళ్ల కాలంలో పై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారని బాబు ఆరోపించారు 2019 జూన్ 25వ తేదీన తన సెక్యూరిటీని తగ్గించారని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పర్యటనలో భాగంగా అంగళ్లు, పుంగనూరులో మాపై దాడులకు తెగబడ్డారన్నారు.

అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, ఈ సంఘటనలన్నీ భద్రతా లోపాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు.వీటిని దృష్టిలో ఉంచుకుని నాకు అందించే జెడ్ ప్లస్ భద్రతకు అనుగుణంగా సెంట్రల్ జైలు చుట్టుపక్కల భద్రతను పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయమూర్తిని కోరారు.

తదుపరి వ్యాసం