పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రిజర్వాయర్ ఉండకపోవచ్చన్న ఉండవల్లి
24 May 2022, 13:54 IST
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన డ్యామ్ నిర్మాణాన్ని అసలు చేపట్టకపోవచ్చని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్, ప్రధాన ఆనకట్టల నిర్మాణానికి కేంద్రం ముందుకు వెళ్లకపోవచ్చన్నారు. పరిహారం కోసమే 30వేల కోట్ల రుపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో గ్రావిటీ ద్వారా మాత్రమే నీటి సరఫరాకు అవసరమైన పనులు మాత్రమే చేస్తారని అభిప్రాయపడ్డారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్ నిర్మాణం జరగకపోవచ్చని ఉండవల్లి జోశ్యం చెప్పారు. ప్రాజెక్టులో 41 మీటర్ల నీటి మట్టంతో గ్రావిటీ మీద నీటి సరఫరా మాత్రమే చేస్తారని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం జరగదన్నారు. కేవలం పరిహారం కోసమే 30వేల కోట్ల రుపాయలు ఖర్చు చేయాల్సి ఉన్నందున ఆ బాధ్యత కేంద్రం తీసుకునే సాహసం చేయదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మంత్రి అంబటి రాంబాబు నిజాయితీగా నిజాన్ని అంగీకరించారని, ఎప్పట్లోగా పనులు పూర్తవుతాయో చెప్పలేమని నిజం చెప్పారన్నారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ మరొకరైనా ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్రం అనుమతి లేకుండా ముందుకు వెళ్లలేరన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందనే సంగతి 2017లో బయట పెడితే తనను టీడీపీ నేతలు నానా తిట్లు తిట్టారని గుర్తు చేశారు.
రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి ఆరోపించారు. దేశంలో ఎవరు చేయని ప్రయోగాన్ని జగన్ చేస్తున్నారని ఓట్లేసే వారికి చేయాల్సినంత చేస్తున్నారని, ఓట్లు వేయని వారిని వదిలేస్తున్నారన్నారు. 2014 తర్వాత రాష్ట్రంలో స్పష్టంగా కులవిభజన వచ్చేసిందని, కమ్మ, రెడ్లు ప్రభుత్వాలను శాసిస్తున్నారన్నారు. ప్రభుత్వాల విషయంలో గతంలో పార్టీలకు ముసుగులు ఉండేవని, ఇప్పుడు అన్ని భేషజాలు వదిలేశారన్నారు. సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వం అంటే చారిటీ కాదని, దేశంలో ఎవరు అలా చేయలేదని డబ్బు పంచడమే ఇప్పుడు జగన్ పాలన అనుకుంటున్నారన్నారు. ఆంధ్రాలో ఈ ప్రయోగం విజయవంతం అవుతుందో లేదో చెప్పలేమన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అమలు చేయమని చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. కరోనా ఉన్నా డబ్బులు ఇవ్వడం ఆపకపోవడాన్ని తాను అభినందించానని గుర్తు చేశారు. కానీ ఐదేళ్ల క్రితం రేట్లతో పోలిస్తే విపరీతంగా ధరలు పెరిగాయన్నారు. జగన్ ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నామనుకునే వాళ్లు, ఇంకొకరు వస్తే బాగుంటుందనుకునే
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల పాలనకు పెద్ద తేడా లేదని, విభజనతో మనకు ఏమి రావాల్సి ఉందనే విషయంలో ఎవరు నోరు మెదపడం లేదన్నారు. ఇద్దరు నాయకులకు సంబంధించిన ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉండటం కారణమన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయితే ముడుపుల కోసం చంద్రబాబు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని, ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వస్తే కేంద్రానికి బాధ్యత అప్పగిస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ పనిచేయలేదన్నారు. చేయాల్సిన పనులు వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారన్నారు.
టాపిక్