తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Laddu Controversy : తిరుపతి లడ్డూ వివాదం - స‌మగ్ర నివేదిక కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ

Tirupati Laddu Controversy : తిరుపతి లడ్డూ వివాదం - స‌మగ్ర నివేదిక కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ

HT Telugu Desk HT Telugu

20 September 2024, 18:03 IST

google News
    • తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీపై జ‌రుగుతున్న వివాదాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఈ మేర‌కు దీనిపై స‌మగ్ర నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ విష‌యంపై సీబీఐ విచార‌ణకు డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ (ఫైల్ ఫొటో)
తిరుమల లడ్డూ (ఫైల్ ఫొటో)

తిరుమల లడ్డూ (ఫైల్ ఫొటో)

తిరుమ‌ల శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదం ల‌డ్డూ త‌యారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు క‌లిపిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌య ప్ర‌కాశ్ న‌డ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర నివేదికను ఇవ్వాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబునాయుడిని కోరారు.

చర్యలు ఉంటాయి - కేంద్రమంత్రి నడ్డా

ఈ మేరకు శుక్ర‌వారం ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో న‌డ్డా మాట్లాడుతూ తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో మాట్లాడాన‌ని, వారి వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని పంపించ‌మ‌ని చెప్పాన‌ని అన్నారు. కేంద్రం ఈ విష‌యంలో రాష్ట్రానికి పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

కేంద్ర కార్మిక స‌హాయ మంత్రి శోభాకరంద్లాజే… ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. తిరుమ‌ల‌కు చెందిన క‌ళాశాల‌ల్లో ప‌ద్మావ‌తీ శ్రీ‌నివాసుల ఫొటోల‌ను తొల‌గించాల‌ని, హిందూయేత‌ర గుర్తుల‌ను స‌ప్త‌గిరుల‌పై ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ అండ్ కో చూసింద‌ని ఆరోపించారు. హిందువులు కానివారిని బోర్డ్ ఛైర్మ‌న్‌గా నియ‌మించింద‌ని, జంతువుల కొవ్వుల‌ను ప‌విత్ర ప్ర‌సాదంలో క‌లిపింద‌ని విమ‌ర్శించారు. ‘వెంక‌టేశ్వ‌ర‌స్వామీ.. మా చుట్టూ జ‌రుగుతున్న ఈ హిందూ వ్య‌తిరేక రాజ‌కీయాల‌ను మ‌మ్మ‌ల్ని క్ష‌మించు’ అంటూ ఘాటూగా స్పందించారు.

సమగ్ర దర్యాప్తు అవసరం - కేంద్రమంత్రి ప్ర‌హ్లాద్ జోషి

కేంద్ర ఆహార, ప్ర‌జా పంపిణీ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. ల‌డ్డూ క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు అవ‌స‌ర‌మ‌ని, దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపి, దోషులుగా తేలిని వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ సీబీఐ విచార‌ణకు డిమాండ్ చేశారు.

జేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ స్పందిస్తూ… ఇది ప్ర‌జ‌ల విశ్వాసంపై నేరుగా జ‌రిగిన దాడి అని, వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు. ప‌క్కా ప్రణాళిక‌తో జ‌రిగిన కుట్ర ఇదని, కేవ‌లం వ్యాపార ప్రయోజ‌నాల కోసం కోట్ల మంది భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని ఆరోపించారు. దీనికి కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, ఇది ఏమాత్రం క్ష‌మించ‌రాని నేర‌మ‌ని అన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం