Waltair DRM Arrest : పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్
17 November 2024, 15:53 IST
Waltair DRM Arrest : విశాఖలోని వాల్తేరు డీఆర్ఎమ్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఓ టెండర్ విషయంలో డీఆర్ఎమ్ రూ.10 లక్షల లంచం తీసుకోగా...సీబీఐకి పట్టుకుంది. ఈ కేసులో ముంబయి, విశాఖలోని డీఆర్ఎమ్ ఇళ్లలో సీబీఐ అధికారుల సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్
విశాఖ వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎమ్) సౌరభ్ ప్రసాద్ సీబీఐకి చిక్కారు. ఓ టెండర్ విషయంలో రూ.10 లంచం తీసుకోగా...సమాచారం అందుకున్న సీబీఐ మాటు వేసి డీఆర్ఎమ్ ను శనివారం అరెస్టు చేసింది. వాల్తేరు డివిజన్ లో మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి డీఆర్ఎమ్ రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇచ్చేందుకు డీఆర్ఎమ్ ను కాంట్రాక్టర్ ముంబయికి రావాలని కోరాడు. దీంతో శనివారం ముంబాయి వెళ్లిన డీఆర్‌ఎమ్ కాంట్రాక్టర్ నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుని... ముంబయిలోని తన ఇంటికి వెళ్లగా... అప్పటికే సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నగదుతో సహా డీఆర్ఎమ్ ను పట్టుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ముంబయి, విశాఖలోని డీఆర్ఎమ్ ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సీబీఐ అధికారులు డీఆర్‌ఎమ్ సౌరభ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. వైజాగ్‌లోని డీఆర్‌ఎమ్ కార్యాలయంలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఇటీవలె గుంతకల్ డీఆర్ఎమ్ అరెస్ట్
ఈ ఏడాది జులైలో ఇదే విధమైన కేసులో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్‌తో సహా ఐదుగురు రైల్వే సీనియర్ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. గుంతకల్ రైల్వే డివిజన్‌లో ఆర్థిక, పాలనాపరమైన అవకతవకల నేపథ్యంలో సీబీఐ వారిని అరెస్టు చేసింది. కొంతమంది నిందితుల ఇళ్లలో సీబీఐ బృందాలు సోదాలు చేయగా... పెద్ద మొత్తంలో నగదు లభించింది. వినీత్ సింగ్ నివాసంలో సుమారు రూ.7 లక్షలు, మరో ముగ్గురు వ్యక్తుల ఇళ్లలో రూ.11 లక్షల నగదు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్టేషన్ బెయిల్ కోసం లంచం ఎస్సై, రైటర్ అరెస్ట్
స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై, రైటర్ చిక్కిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట పీఎస్ లో చోటుచేసుకుంది. లింగంపేటకు చెందిన జంగంపల్లి శివలింగంగౌడ్... ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. గత గురువారం బాధితుడు స్టేషన్ రైటర్‌కు డబ్బు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్సై అరుణ్ సూచనతోనే తాను డబ్బు తీసుకున్నానని రైటర్ చెప్పడంతో ఏసీబీ అధికారులు ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. పంచనామా అనంతరం నిందితులిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. ఎస్సై అరుణ్ పై అవినీతి ఆరోపణలున్నాయి. ఎస్సై విపరీతంగా మామూళ్లు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.