Kolkata Rape Case : కోల్‌కతా హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌పై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు
RG Kar Rape Case : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌పై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సంజయ్ రాయ్‌పై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.
ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 9న ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సంజయ్ రాయ్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో ఆమె షిఫ్ట్ మధ్య విశ్రాంతి తీసుకోవడానికి గదికి వెళ్లింది. ఆమె మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం ఒక జూనియర్ డాక్టర్ చూశారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, బాధితురాలిని అత్యాచారం చేసి హత్య చేశారు. శవపరీక్షలో ఆమె శరీరంపై 25 అంతర్గత, బాహ్య గాయాలు అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది.
అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులు సంజయ్ రాయ్ నిందితుడిగా పేర్కొన్నారు. ఆగస్ట్ 9 తెల్లవారుజామున 4.03 గంటలకు సెమినార్ గదిలోకి అతడు ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దాదాపు అరగంట తర్వాత అతను గది నుండి బయటకు వచ్చాడు. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను కోల్‌కతా పోలీసులు కనుగొన్నారు. తర్వాత ఈ కేసు సీబీఐకి వెళ్లింది.
సీబీఐ కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్షకు నిర్వహించారు. తాను నిర్దోషి అని పరీక్షలో సంజయ్ చెప్పాడు. తాను సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, మహిళ అప్పటికే అపస్మారక స్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఎందుకు తెలియజేయలేదని అడిగినప్పుడు, గాయపడిన స్థితిలో ఉన్న మహిళను చూసి తాను భయాందోళనకు గురయ్యానని వెల్లడించాడు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది. తనను ఇరికిస్తున్నారని సంజయ్ రాయ్ కూడా చెప్పుకొచ్చాడు.
బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటల పాటు వేచి ఉండేలా చేశాడు. స్థానిక పోలీసు అధికారిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. దీనితోపాటు ఆర్‌జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసులోనూ అతడు విచారణ ఎదుర్కొంటున్నాడు.