Kolkata rape: కోల్ కతా రేప్ నిందితుడు సంజయ్ రాయ్ కు నార్కో ఎనాలిసిస్ టెస్ట్!; అసలు ఏంటీ నార్కో అనాలసిస్ పరీక్ష?
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ పై నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని కోల్ కతా కోర్టును సీబీఐ కోరింది. సంజయ్ రాయ్ పై సీబీఐ ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది.
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ ను నార్కో అనాలసిస్ కు అనుమతించాలని కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోల్ కతా కోర్టును ఆశ్రయించింది. రాయ్ అంగీకారం కోసం శుక్రవారం క్లోజ్ డోర్ విచారణ కోసం ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
నిందితుల అనుమతి తప్పనిసరి
నార్కో అనాలిసిస్ నిర్వహించడానికిి నిందితుల అనుమతి తప్పనిసరి. నిందితుల అనుమతి లేకుండా నారో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని 2010లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నార్కో విశ్లేషణకు చట్టపరమైన చెల్లుబాటు ఉంది. కానీ కోర్టులు దానిని నిర్వహించే పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పరిమిత ఆమోదాన్ని మంజూరు చేయవచ్చు.
పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఏం చెప్పాడు?
శుక్రవారం విచారణ సందర్భంగా తన న్యాయవాది సమక్షంలో నార్కో విశ్లేషణ ప్రక్రియను రాయ్ కు వివరించారు. ఈ కేసులో రాయ్ తో పాటు మరికొందరికి సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. ఆగస్టు 10న తెల్లవారు జామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. మరుసటి రోజు కోల్ కతా పోలీసులు రాయ్ ను అరెస్టు చేసి ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే, తాను నిర్దోషినని, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని రాయ్ చెబుతున్నారు. ఆగస్టు 23న కలకత్తా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
రాయ్ చెప్పేది వాస్తవమేనా?
సీబీఐ విచారణలో రాయ్ చెప్పేది నిజమో కాదో క్రాస్ చెక్ చేయడానికే నార్కో అనాలసిస్ పరీక్షను నిర్వహించనున్నారు. అతని వెర్షన్ ను ధృవీకరించడానికి మాకు ఈ టెస్ట్ సహాయపడుతుంది" అని ఒక సీబీఐ అధికారి చెప్పారు.
నార్కో అనాలసిస్ పరీక్ష అంటే ఏమిటి?
నార్కో అనాలసిస్ టెస్ట్ (narco analysis) సమయంలో, సోడియం పెంటొథల్ (sodium pentothal) అనే మందును నిందితుడి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది నిందితుడిని హిప్నోటిక్ స్థితికి తీసుకువెళుతుంది. నిందితుడి ఊహాశక్తిని అణచివేస్తుంది. దాంతో, నిందితులు నిజమైన సమాచారం ఇస్తారు.
సంజయ్ రాయ్ ను ఎందుకు అరెస్టు చేశారు?
ఆగస్టు 10 తెల్లవారు జామున ఆస్పత్రిలోని సెమినార్ హాల్ లో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పీజీ వైద్య విద్యార్థిని అయిన ఆమె 36 గంటల షిఫ్ట్ మధ్య విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాళ్లోకి వెళ్లింది. ఆగస్టు 9న తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ ఆ గదిలోకి ప్రవేశించడం సీసీటీవీలో రికార్డయింది. కొన్ని గంటల తర్వాత అత్యాచారానికి గురైన ఆ మహిళ మృతదేహం గదిలో కనిపించింది. ఘటనా స్థలంలో రాయ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కూడా లభ్యమయ్యాయి.
నేను అమాయకుడినంటున్న సంజయ్ రాయ్
అయితే, తాను ఆ గదిలోకి వెళ్లినప్పటికే ఆ ట్రైనీ డాక్టర్ అపస్మారక స్థితిలో ఉందని, తాను భయపడి అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ రాయ్ చెబుతున్నాడు. పాలీగ్రాఫ్ పరీక్షలో కూడా సంజయ్ రాయ్ అదే విషయాన్ని చెప్పాడు. తాను నిర్దోషినని, తనను ఇరికించారని ఆరోపించారు. నిర్దోషి అయితే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా తాను భయపడ్డానని చెప్పాడు. ఆ ట్రైనీ డాక్టర్ శరీరంపై 25 అంతర్గత, బాహ్య గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.