తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sabarimala Pilgrims : ఆంధ్రా అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా… 18మందికి గాయాలు

Sabarimala pilgrims : ఆంధ్రా అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా… 18మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu

19 November 2022, 13:03 IST

google News
  • Sabarimala pilgrims కేరళలో అయ్యప్ప దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన ఆంధ్రా భక్తుల బస్సు పతనంతిట్టలో ప్రమాదానికి గురైంది. కొండ మలుపులో  కిందకు దిగుతున్న బస్సు అదుపు తప్పి  బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 18మంది శబరిమలై వెళ్లిన భక్తులు గాయపడ్డారు. తీవ్ర గాయాల పాలైన వారిని కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

కేరళ పతనంతిట్టలో ఆంధ్రా అయ్యప్పలు ప్రయాణిస్తున్న  బస్సు బోల్తా....
కేరళ పతనంతిట్టలో ఆంధ్రా అయ్యప్పలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా....

కేరళ పతనంతిట్టలో ఆంధ్రా అయ్యప్పలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా....

Sabarimala pilgrims శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న ఆంధ్రా భక్తులు ప్రమాదానికి గురయ్యారు. శనివారం పతియం తిట్ట జిల్లాలోని లాహా సమీపంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు బోల్తాపడటంతో బాలుడితో సహా 20 మందికి పైగా గాయపడ్డారు.

వాహనంలో ప్రయాణిస్తున్న 44 మంది యాత్రికులను స్థానికులు రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. గాయపడిన 18 మందిని కొట్టాయం జనరల్ ఆసుపత్రిలో, మిగిలిన వారిని సమీపంలోని పెరినాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, ట్రాన్స్ పోర్ట్‌ శాఖ అధికారులు, స్థానికులు సంయుక్తంగా సమన్వయంతో త్వరితగతిన రెస్క్యూ నిర్వహించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ యాత్రికులకు సహాయక చర్యలు, తదుపరి చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గాయపడిన వారందరికీ అవసరమైన చికిత్స అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితుల్ని ఆదుకోవాలని సిఎం ఆదేశం…

కేరళలోని పతనంతిట్ట వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం గురి కావడంపై సిఎం జగన్మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు.

శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.

ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం 2 బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో శనివారం ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. గాయపడిన వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

తదుపరి వ్యాసం