Advertisement Dues : ప్రకటనలు ఫుల్… పైసలు నిల్….
25 October 2022, 11:18 IST
- Advertisement Dues ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలకు ప్రకటనలు దండిగా వస్తున్నా వాటికి సంబంధించిన చెల్లింపులు మాత్రం జరగడం లేదు. దీంతో చిన్న పత్రికలు, ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడిన సంస్థలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రకటనలు వస్తున్నా వాటికి సంబంధించిన చెల్లింపులు జరగకపోవడంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా మీడియా సంస్థలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రకటనల బకాయిలు కోసం పత్రికలు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షణ చేయడం పరిపాటైంది.
ఏపీలో పత్రికలకు ప్రభుత్వ ప్రకటనల భారం
Advertisement Dues ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు గుదిబండగా మారాయి. కోవిడ్ కారణంగా చిన్నా, పెద్ద పత్రికలన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది.సర్క్యూలేషన్ పడిపోయి అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. వరుసగా రెండేళ్లు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావడంతో పెద్ద మీడియా సంస్థలు కూడా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరోవైపు మార్కెట్ స్థిరంగా లేకపోవడంతో అడ్వైర్టైజ్‌మెంట్ రంగం సమస్యల్ని ఎదుర్కొంటోంది. పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు దండి ఉంటున్నా వాటికి చెల్లింపులు మాత్రం తగ్గపోవడం పత్రికల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అడపాదడపా చెల్లింపులు జరుపుతున్నా మీడియా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడంతో అన్ని ప్రధాన సంస్థల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
వరుసగా రెండేళ్లుగా మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో మీడియా సంస్థలకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.
2021 డిసెంబర్ 31నాటికి రూ.96.59కోట్ల రుపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. 2022 బకాయిలు కూడా జత చేయాల్సి ఉంది. 2020-21లో ప్రధాన తెలుగు,ఇంగ్లీష్ పత్రికలకు భారీగా బకాయిలు ఉన్నాయి 20-21లో ఈనాడుకు రూ.12.67 కోట్లు, ప్రజాశక్తికి రూ.17.52కోట్లు, ఆంధ్రప్రభకు రూ.31.57కోట్లు, వార్తకు రూ.29.69కోట్లు, విశాలాంధ్రకు రూ.10.64కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకు రూ.5.56కోట్లు, పయనీర్‌కు రూ.2.56కోట్లు, ముంబై ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రూ.4కోట్లు, ఎకనామిక్ టైమ్స్‌కు రూ.1.16లక్షలు, పీరియాడికల్స్‌కు రూ.59.49లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2020-21లో సాక్సి, దిహిందూ, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్రానికల్, హన్స్ ఇండియాలకు ఎలాంటి బకాయిలు లేవు.
2021-22లోను భారీగా బకాయిలు….
2021-22 ఆర్ధిక సంవత్సరంలోను మీడియా సంస్థలకు భారీగా బకాయి పడ్డారు. కొన్ని సంస్థలకు ఏడాది చెల్లింపులు బకాయి ఉండగా, మరికొన్నింటికి రెండు,మూడేళ్లుగా చెల్లింపులు లేవు. 2021-22లో సాక్షికి 20.44కోట్లు, ఈనాడుకు 50.06కోట్లు, ప్రజాశక్తికి కోటి 32లక్షలు, ఆంధ్రప్రభకు 67.80లక్షలు, వార్తకు రూ.59.97లక్షలు, హిందూకు రూ.3.49కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకు 58లక్షలు, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు 75లక్షలు, డెక్కన్ క్రానికల్‌కు రూ.2.63కోట్లు, హన్స్ ఇండియాకు రూ.56.61లక్షలు, పయనీర్‌కు 60.59లక్షలు, ఇతర పీరియడికల్స్‌కు రూ.48లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
రెండేళ్లలో కలిపి దాదాపు రూ.100కోట్ల రుపాయల ప్రకటనల బకాయిలు వివిధ పత్రికలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఈ ఆర్ధిక సంవత్సరం కొన్ని పత్రికలకు బకాయిలు చెల్లించినా ఇంకా చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయి. 2020-21లో క్లాసిఫైడ్స్, డిస్‌ప్లే యాడ్స్‌కు కలిపి రూ.14.34కోట్లు బాకీ పడితే, 2021-22లో రూ.96.59కోట్లు బకాయి పడ్డారు. వివిధ మీడియా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల కోసం పత్రికలు నిత్యం సమాచార శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు. మరోవైపు గత ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలు కూడా చాలా సంస్థలకు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఎన్నికల సమయంలో వివిధ సంస్థలకు ప్రకటనల రూపంలో భారీగా మంజూరు చేసినా వాటికి సంబంధించిన చెల్లింపులు చేయకపోవడంతో మీడియా సంస్థలు భారీగా నష్టపోయాయి.
టాపిక్