తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity Burden: ఓ వైపు సర్దుబాటు ఛార్జీల భారం, మరో వైపు లోడ్‌ పేరిట అదనపు వసూళ్లు,ఉచిత కనెక్షన్ల రద్దు హెచ్చరికలు

AP Electricity Burden: ఓ వైపు సర్దుబాటు ఛార్జీల భారం, మరో వైపు లోడ్‌ పేరిట అదనపు వసూళ్లు,ఉచిత కనెక్షన్ల రద్దు హెచ్చరికలు

20 December 2024, 13:46 IST

google News
    • AP Electricity Burden: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖలో ఏం జరుగుతుంతో అంతు చిక్కడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ల తొలగింపు, అదనపు లోడ్‌ వినియోగ ఛార్జీల వసూళ్లతో జనం గగ్గోలు పెడుతున్నారు.ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోయినా క్షేత్ర స్థాయిలో తనిఖీల పేరుతో జరుగుతున్న హడావుడి బెంబేలెత్తిస్తోంది. 
ఉచిత విద్యుత్‌ పథకంపై ఏపీలో గందరగోళం
ఉచిత విద్యుత్‌ పథకంపై ఏపీలో గందరగోళం

ఉచిత విద్యుత్‌ పథకంపై ఏపీలో గందరగోళం

AP Electricity Burden: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై రగడ కొనసాగుతుండగానే మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో పంపిణీ సంస్థల హడావుడితో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంటింటి తనిఖీల పేరుతో విజిలెన్స్‌ సిబ్బంది గృహ వినియోగదారుల్లో సబ్సిడీ కనెక్షన్ల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిని తొలగిస్తామని చెబుతున్నారు. ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఏసీలను వినియోగించే వారితో పాటు గతంలో ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేని వాటిని తొలగిస్తామని గ్రామాల్లో చెబుతున్నారు. దీనిపై అధికారికంగా విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలదేని అధికారులు చెబుతున్నారు.

ప్రజలపై కొత్తగా లోడ్‌ ఛార్జీల భారం…

ఉచిత కనెక్షన్ల ఏరివేతతో పాటు అదనపు లోడ్‌ వినియోగిస్తున్న వారి నుంచి లోడ్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఇంధన శాఖ రెడీ అవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గృహ వినయోగదారులను తనిఖీ చేసి ప్రస్తుతం ఉన్న క్యాటగిరీల నుంచి మరో క్యాటగిరీకి కనెక్షన్లను మారుస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు జనవరి మొదటి వారంలో జారీ చేసే బిల్లుల్లో అదనపు లోడ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారులకు మౌఖికంగా చెబుతున్నారు. గృహ అవసరాల కనెక్షన్లలో ఒక్కో కిలో వాట్‌కు దాదాపు రూ.3500 వరకు వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుత వినియోగాన్ని బట్టి దానిని పెంచుతున్నారు. దీంతో ఒక్కొక్కరిపిపై ఏడెనిమిది వేల వరకు భారం పడనుంది.

మరోవైపు లోడ్‌ సర్దుబాటు, సబ్సిడీ కనెక్షన్ల తొలగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో విద్యుత్‌ ఛార్జీలు, సబ్సిడీల వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు గందరగోళానికి కారణం అవుతున్నాయి.

అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్…

ఏపీలో అర్హులైన ప్ర‌తి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతంతో ఏపీలో 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం లో ల‌బ్ధిదారులుగా ఉన్నార‌ు. మొత్తం 19,92,855 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు ఉచిత విద్యుత్ ను అందించేందుకు నెల‌కు సుమారు రూ.477.30 కోట్లు వినియోగిస్తున్న‌ారు. ఉచిత విద్యుత్‌ ల‌బ్ధిదారుల్లో ఎవ‌రికైనా అనుమానాలు ఉంటే.. 1912కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని మంత్రి చెప్పారు.

క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు..

విద్యుత్ ఛార్జీలు, సబ్సిడీల కొనసాగించే విషయంలో ప్రభుత్వ వైఖరికి భిన్నంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ పథకాలను రద్దు చేస్తామని ఇళ్లకు వెళ్లి హెచ్చరించడం, అదనపు లోడ్‌ వసూళ్ల వెనుక కొందరు ఉద్యోగులు, అధికారులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం