తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Budget 2024 : ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్.. 7 ప్రశ్నలు వేసిన బుగ్గన.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

AP Budget 2024 : ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్.. 7 ప్రశ్నలు వేసిన బుగ్గన.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

11 November 2024, 17:46 IST

google News
    • AP Budget 2024 : ఏపీ వార్షిక బడ్జెట్‌ను రూ.2,94,427కోట్ల మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను నవంబర్ 11న ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్‌పై వైసీపీ రియాక్ట్ అయ్యింది. బుగ్గన కీలక అంశాలను ప్రస్తావించారు.
ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్
ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్ (x)

ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్

ఐదు నెలల పాటు బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారు.. ఇంత అనుభవం ఉన్నా ఇన్నాళ్లు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారో అర్థం కాలేదని.. వైసీపీ కీలక నేత, మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే బడ్జెట్ పెట్టామని వివరించారు. బడ్జెట్ స్పీచ్ లో 21సార్లు గత ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారని సెటైర్లు వేశారు.

1.పథకాలకు కేటాయింపులు లేకుండానే రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటా? అప్పో? చెప్పలేదు. 24 వేల కోట్ల పన్ను ఏ విధంగా పెంచుతారో ప్రభుత్వం చెప్పాలి.

2.బడ్జెట్లో రూ.5 వేల కోట్లు ఎక్కడెక్కడో కేటాయించారు. వాస్తవానికి తల్లికి వందనం పథకానికి రూ.12,450 కోట్లు అవసరం. తల్లికి వందనం పథకం ఇంటింటికీ ఎంత ఇవ్వబోతున్నారో చెప్పాలి.

3.అన్నదాత సుఖీభవ పథకానికి 10,706 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.వెయ్యి కోట్లు. అన్నదాత సుఖీభవ పథకం ఎంత మందికి అమలు చేస్తారో చెప్పాలి.

4.ఏ రకంగా అమరావతి గొప్ప నగరం? వరల్డ్ బ్యాంక్ వాళ్లు వెనకడుగు వేస్తున్నారు. మీరేమో అప్పు మీద కడతామంటున్నారు. అప్పులు ఇచ్చే బ్యాంకులు కూడా చూసుకోవాలి.

5.2014లో 87వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ అన్నారు. కేవలం 15 వేల కోట్లు ఇచ్చారు. 2014లో అన్నదాతలకు సున్నా వడ్డీ పథకం కింద రూ 11,600 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ రైతుల సున్నా వడ్డీ కేవలం రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చారు.

6.ఈ రోజు అసెంబ్లీలో అప్పులు గురించి నిజం చెప్పారు. మొత్తం అప్పు 14 లక్షల కోట్లు కాదు. బాబుకు ముందు, బాబు చేసిన అప్పు కలిపి 2024 మర్చి 31 నాటికి మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు (6,46,531) అని నేటి బడ్జెట్‌లో చూపారు.

7.అప్పులపై గతంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. మరో శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేశారు. మేము 14 లక్షల కోట్లు అప్పు చేశామని తప్పుడు ప్రచారం చేశారు.

ఎమ్మెల్యేలతో జగన్ భేటీ..

వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. 'ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశాం. కౌంటర్‌కు స్పీకర్‌ సమాధానం ఇవ్వడంలేదు. ఏపీ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ. కానీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు' అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం