Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణం, వివాహేతర సంబంధంతో దారుణ హత్య.. భవానీ మాలధారణతో కిరాతకం
17 December 2024, 9:24 IST
- Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్యకు గురైంది.భవానీ మాలధారణతో ఉన్న నిందితుడు ఆమె కత్తితో దాడి చేసి హతమార్చాడు.చప్పుడుకు నిద్ర లేచిన పిల్లలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు.
శ్రీకాకుళంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య
Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో వివాహేతర సంబంధంతో మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస నిర్వాసిత కాలనీలో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్వాసిత కాలనీలో దామోదర కృష్ణ, దామోదర పద్మ (35) నివాసం ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పద్మ కూలి పనులు చూస్తూ, కిరాణా దుకాణం నడిపించుకుంటూ తన కుమార్తెలను జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలను కూడా బాగా చదివించాలని అనుకుంది. అలానే పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె పదో తరగతి చదువుతున్నారు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తన పక్కింట్లో ఉండే సొండి సురేష్‌తో పద్మకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పద్మ ఇటీవల వేరే వాళ్లతో మాట్లాడుతుండటం గమనించిన సురేష్ ఆమెతో గొడవ పడ్డాడు. పద్మపై అనుమానం పెంచుకున్నాడు. సురేష్ తనను ఇబ్బంది పెడుతున్నట్లు పద్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. నిందితుడు సురేష్ ఇటీవల భవానీ మాల కూడా వేసుకున్నాడు. తనపైనే ఫిర్యాదు చేయడంతో పద్మపై ఒకపక్క అనుమానం, మరోపక్క కోపంతో రగిలిపోయేవాడు.
ఆదివారం అర్థరాత్రి దాడిన తరువాత భవానీ మాలధారణతో ఉన్న సురేష్, పద్మ ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తట్టాడు. పద్మ ఇద్దరు పిల్లలు నిద్రపోవడంతో తలుపు తీసింది. ఇంట్లోకి వెళ్లిన సురేష్, పద్మతో గొడవ పడ్డాడు. ఇలా వీరిద్ధరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కోపంతో ఉన్న సురేష్ తన వద్దనున్న కత్తితో పద్మ పొట్టపై పొడిచాడు. దీంతో పద్మ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. వీరిద్ధరి మధ్య జరుగుతున్న గొడవకు వచ్చిన శబ్ధంతో పద్మ ఇద్దరు కుమార్తెలు నిద్ర నుంచి మేలుకున్నారు. వెంటనే రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పెద్దగా కేకలు వేశారు.
వెంటనే నిందితుడు సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పటికే తెల్లవారుజాము కావడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం స్థానికులకు వివరాలు అడిగి సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గాజులకొల్లివలస నిర్వాసిత కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి ఇద్దరు కుమార్తెల బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ రోదించడంతో స్థానికులసైతం కన్నీరు కార్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
మృతురాలి పద్మ పెద్ద కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించి అశ్లీల ఫోటోలు, వీడియోలను నిందితుడు స్నేహితుల మొబైల్ ఫోన్‌లకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడిపై మరో కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఎస్ఐ వెంకటేష్ అన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)