తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Strategy: టీడీపీతో పొత్తులకు సై.. బాబు పెత్తనానికి మాత్రం నాట్ ఓకే.. బీజేపీ ప్లాన్ ఇదే…

BJP Strategy: టీడీపీతో పొత్తులకు సై.. బాబు పెత్తనానికి మాత్రం నాట్ ఓకే.. బీజేపీ ప్లాన్ ఇదే…

HT Telugu Desk HT Telugu

21 June 2023, 13:30 IST

google News
    • BJP Strategy: బీజేపీకి చేరువ కావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిపై కమలనాధుల్లో ఇంకా సందేహాలు వీడలేదు. రెండు రాష్ట్రాల్లో టీడీపీతో అనుసరించాల్సిన వైఖరిపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును అందిపుచ్చుకోవాలనే ఆలోచన బీజేపీలో కూడా ఉండటంతో పొత్తులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
టీడీపీ, బీజేపీ
టీడీపీ, బీజేపీ (HT )

టీడీపీ, బీజేపీ

BJP Strategy: తెలుగు రాష్ట్రాల్లో బిజేపితో తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బీజేపీతో-టీడీపీ పొత్తు అనివార్యమైతే అది ఏపీకి మాత్రమే పరిమితమవుతుందని చెబుతున్నారు.

తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నా దానిపై బీజేపీ అధినాయకత్వం సానుకూలత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. తెలంగాణలో టిడిపితో బంధం కేవలం "సానుకూల వైఖరి, సందేశాల" వరకే బిజేపి పరిమితం అవుతుందని చెబుతున్నారు.

ఏపిలోని జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఇతోదికంగా ఆర్ధిక సహాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం ఆర్దిక సహకారం కొనసాగుతుందని బిజేపి వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీతో తెగదెంపులు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు.

ఏపీ తెలంగాణలో ఎన్నికల పొత్తులు, రాజకీయ అవగాహనలు పూర్తిగా మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోడి ఎవరితోనూ నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం లేకపోయినా, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఏ నిర్ణయమైన ఉంటుందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలనే ప్రతిపాదనలపై బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తమను గతంలో "వెన్నుపోటు" పొడిచారని, మిత్రధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును అందుకోడానికి బీజేపీని కలుపుకుపోవాలనే చంద్రబాబు వ్యూహాలకు "చెక్" పెట్టేలా నిర్ణయాలు ఉండాలని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అవగాహన కుదిరినా,గతంలో మాదిరి అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు అన్నిట్లో జోక్యం చేసుకునే విధానాలకు స్వస్తి పలకాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ నాయకుల జోక్యం, డమ్మీలను పోటీలో ఉంచడం వంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

ఏపీలో టిడిపిని వ్యూహాత్మకంగా వినియోగించుకోవడం వరకే పరిమితం కావాలని ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. "అన్ని జాగ్రత్తలతో" బాబుతో పొత్తులు కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి తరహాలో బీజేపీలోకి త్వరలో మరికొంత మంది నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా బలమైన అభ్యర్థుల్ని పోటీలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.

10లోక్‌సభ… 20 అసెంబ్లీ స్థానాలు లక్ష్యం….

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ 10 లోకసభ స్థానాలు, 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి బిజేపి సమాయత్తం అవుతోంది. అదే సమయంలో బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలకు చెక్‌ పెడతారని ప్రత్యర్థులు చెబుతున్నారు.

పైకి బిజేపి నేతలుగా కనిపిస్తూ, టిడిపి క్షేమాన్ని కోరుకునే వారికి ఈసారి ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బిజేపిలోకి వచ్చిన మాజీ టిడిపి నేతలకు తిరిగి చంద్రబాబే అవకాశం ఇవ్వాలని వైరివర్గం నేతలు చెబుతున్నారు. బిజెపి అభ్యర్దులను కూడా నిర్ణయించే పెత్తనాలను ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితులు లేవంటున్నారు.

గతంలో చంద్రబాబు స్నేహం పేరుతో పెత్తనం చెలాయించడం వల్లే ఏపీలో ఇంతవరకు ఏపిలో బిజేపి కోలుకోలేక పోయుందని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ తరహా రాజకీయాలకు ముగింపు పలకాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. బిజేపి కి పొత్తుల్లో భాగంగా ఏ స్థానాలు ఇవ్వాలి, ఎవరిని అభ్యర్థులుగా ఉంచాలో కూడా "కసరత్తు" చేసి, అమిత్ షా తో చర్చలకు సిద్ధం కావడంపై ఆ పార్టీ నేతలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సంప్రదింపుల కోసం ఢిల్లీ కి వచ్చిన బాబు "చాతుర్యాన్ని" చూసి బిజేపి నాయకత్వం, తీరు మారలేదనే భావనకొచ్చినట్లు చెబుతున్నారు. .

ఏపీ బిజేపిలో ఉన్న అసలైన కార్యకర్తలకు, ప్రజల్లో పలుకుబడి ఉన్న పలురంగాల ప్రముఖులకు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ ఉన్న పలువురు నేతలకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బిజేపి అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరహాలోనే, కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు నేతలను గుర్తించి జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో సుదీర్ఘ కాలం కొనసాగిన పొత్తుల కారణంగా ఏపీలో బిజేపికి, టిడిపి కి తేడా లేదని విశ్వసించే బిజేపి నేతలు గ్రహించినట్లు చెబుతు్నారు. పొత్తుల విషయంలో బీజేపీలో ఎవరెంత ప్రభావితం చేసినా అంతిమ నిర్ణయం మాత్రం మోదీ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ విషయంలో అసలైన రూట్ మ్యాప్‌ మోదీ దగ్గరే ఉందని చెబుతున్నారు.

బీజేపీ-టీడీపీల మధ్య అన్ని అంశాల్లో ఇరుపక్షాలకు సమ్మతమై, పొత్తు కుదిరితే, చంద్రబాబు నిజాయితీగా వ్యవహరిస్తేనే అవి ముందుకు సాగుతాయని చెబుతున్నారు. స్నేహంగా ఉంటూనే బిజేపి అభ్యర్ధులను ఎన్నికల్లో ఓడించే వ్యూహాల పట్ల అనుమానాలున్నాయని బిజేపి వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే బిజేపి అభ్యర్దులు సమర్ధులు కారని, వారిని మార్చాలని, తాము సూచించే అభ్యర్దులనే పోటీ కి ఉంచాలని, అలా చేయకపోతే టిడిపి లోకసభ అభ్యర్ధుల విజయంపై ప్రభావం పడుతుందని చంద్రబాబు వ్యక్తం చేసే భయాందోళనలను పరిగణన లోకి తీసుకోకూడదని బిజేపి అగ్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఏపిలో రెండు ప్రాంతీయ పార్టీల బలాలను ఆయా సందర్భాలు, అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకోవాలనే వ్యూహంతోనే బీజేపీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. క్రమంగా సొంత బలం పెంచుకుని మనుగడను పదిలం చేసుకోవాలనే వ్యూహంతోనే బిజేపి ఉంది. అంతా సవ్యంగా జరిగి, రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపితో జత కట్టినా, అన్ని సందర్భాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన పొరపాట్లకు ఈ సారి తావివ్వకూడదని కమల నాధులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం