Pawan Bhimavaram Tour : పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన అధికారులు, భీమవరం పర్యటన వాయిదా!
13 February 2024, 21:49 IST
- Pawan Bhimavaram Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పవన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు.
పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన అధికారులు
Pawan Bhimavaram Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) భీమవరం(Bhimavaram) పర్యటన వాయిదా పడింది. పవన్ పర్యటనకు ఆర్ అండ్ బీ శాఖ మోకాలడ్డిందని జనసేన(Janasena) ఆరోపించింది. బుధవారం పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనకు రావాల్సి ఉంది. కానీ పవన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ టూర్ వాయిదా వేసినట్లు జనసేన ప్రకటించింది. పవన్ పర్యటన తిరిగి ఎప్పుడనేది త్వరలో తెలియచేస్తామని తెలిపింది. భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలీకాప్టర్(Helicopter) ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని జనసేన తెలిపింది. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం చెప్పడం వెనక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని జనసేన నేతలు ఆరోపించారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులతో అనుమతుల విషయంలో ఇలానే అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. వైసీపీ అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటుందని జనసేన విమర్శించింది.
పవన్ జిల్లాల పర్యటన
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన చేస్తూనే…. మరోవైపు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు. మొన్నటివరకు టీడీపీ - జనసేన పొత్తు మాత్రమే ఉంటుందని అంతా భావించినప్పటికీ… చంద్రబాబు దిల్లీ టూర్ తో మరోసారి మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై అన్ని పార్టీలవైపు నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే…. వచ్చే ఎన్నికల్లో(Andhra Pradesh elections 2024) మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పవన్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా తొలుత గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
పవన్ టూర్ రీషెడ్యూల్
పవన్ కల్యాణ్ (Jansena President Pawan Kalyan)ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రీషెడ్యూల్ కానుంది. ముందుగా ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ టూర్ సాగుతుందని జనసేన ప్రకటించింది. అయితే పవన్ భీమవరం పర్యటన వాయిదా పడడంతో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని జనసేన తెలిపింది. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ సమావేశాలు ఉంటాయని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలలో పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రముఖులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.
మూడంచెల వ్యూహం
పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ. తొలి దశలో ముఖ్య నాయకులు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయని తెలిపింది. రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ కల్యాణ్ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.