తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Saradhi: నిజం చెబుతున్నా నమ్మండి, ఆ సభకు జోగి వస్తున్నాడని తెలీదు.. టీడీపీ శ్రేణులకు మంత్రి సారథి క్షమాపణలు..

Minister Saradhi: నిజం చెబుతున్నా నమ్మండి, ఆ సభకు జోగి వస్తున్నాడని తెలీదు.. టీడీపీ శ్రేణులకు మంత్రి సారథి క్షమాపణలు..

17 December 2024, 12:12 IST

google News
    • Minister Saradhi: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి వేదికను పంచుకోవడంపై మంత్రి కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చారు. జోగి రమేష్‌ ఆ సమావేశానికి వస్తున్నాడని తనకు తెలియదని, వైసీపీ వారిని పిలుస్తున్నామని నిర్వాహకులు తనకు చెప్పలేదన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు ప్రకటించారు. 
టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి
టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి

టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి

Minister Saradhi: మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్‌తో కలిసి వేదికను పంచుకోవడంపై మంత్రి కొలుసు పార్థ సారథి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఘటన వివాదాస్పదం కావడంతో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విచారం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో నివాసంపై దాడి చేయడంతో పాటు, బాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన జోగి రమేష్‌తో కలిసి పలువురు టీడీపీ నాయకులు , ఎమ్మెల్యేలు నూజివీడులో జరిగిన సమావేశంలో పాల్గొనడం వివాదాస్పదమైంది.

ఏం జరిగిందంటే…

డిసెంబర్‌ 15న నూజివీడులో జరిగిన బీసీల నాయకుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ, బహిరంగ సభా కార్యక్రమంలో మంత్రి సారథితో పాటు గౌతు లచ్చన్న కుమార్తె, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ నారాయణ పాల్గొన్నారు. ఇదే సభలో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్‌ కూడా పాల్గొన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌‌ను కార్యక్రమ నిర్వాహకులు సభకు ఆహ్వానించడంతో ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నాయకులు ఆ వేదికను పంచుకున్నారు. ఈ క్రమంలో వేదికపై నుంచి వైఎస్సార్‌ను పొగుడుతూ జోగి రమేష్‌ వ్యాఖ్యలు చేశారు.

నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమంపై ఆ తర్వాత టీడీపీలోని కొందరు అభ‌్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నాయకులతో కలిసి సభలో పాల్గొనడంపై మంత్రి సారథి, గౌతు శిరీషలపై టీడీపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని వారు వివరణ ఇచ్చుకున్నా పరిస్థితి సద్దుమణగ లేదు.

రాజకీయాలతో సంబంధం లేదు..

వైసీపీ నాయకుడు విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో పాల్గొంటున్న సమాచారం తనకు తెలియదని సోమవారమే మంత్రి సారథి స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగలేదు. జోగి రమేష్‌, పార్థసారథి 2024 వరకు ఒకే పార్టీలో కొనసాగారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో టీడీపీలో మరో వర్గం శాంతించలేదు. మంత్రి పార్థసారథి తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో నష్ట నివారణ కోసం పార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సారథి వివరణ ఇచ్చుకున్నారు,.

ఆదివారం జరిగిన సభ గురించి తనను రావాల్సిందిగా 8,9 తేదీ కోరినపుడు 15వ తేదీన వచ్చేందుకు నిర్వాహకులకు సమ్మతి తెలిపానని ఆ సమయంలో ఎవరెవరు కార్యక్రమానికి వస్తున్నారో కూడా వారిని అడిగితే ఇతర పార్టీల నాయకులు ఎవరు రారని చెప్పారని, తాను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడినే కావడంతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు వెళ్లడానికి సమ్మతి తెలిపానని చెప్పారు. ఆ తర్వాత తేదీను ఖరారు చేస్తూ ఆహ్వానితుల జాబితా పంపినపుడు కూడా అందులో జోగిరమేష్ పేరు లేదన్నారు.

జోగి రమేష్‌తో వ్యక్తిగత విభేదాలు లేవని, అదే సమయంలో అతనితో సాన్నిహిత్యం కూడా లేదని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేని విషయంలో కూడా ఇబ్బంది పెట్టారని, గతంలో ట్రోల్స్‌ చేశారన్నారు. నూజివీడు కార్యక్రమానికి జోగి రమేష్‌ వస్తున్నాడని తెలిస్తే వెళ్లే వాడిని కాదన్నారు. తనకు చంద్రబాబు, లోకేష్‌ గౌరవంతో బాధ్యతలు అప్పగించారని, టీడీపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11గంటలకు కార్యక్రమం జరగాల్సి ఉన్నా ఆ రోజు తాను భోజనం చేసేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటిందని చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన ఐ అండ్‌ పీఆర్‌ కార్యక్రమం ఒంటి గంట వరకు జరగడంతో నూజివీడు వెళ్లకూడదని భావించినట్టు చెప్పారు. తనకు నిర్వాహకులు పదేపదే ఫోన్లు చేసి విజ్ఞప్తి చేయడంతోనే వెళ్లాల్సి వచ్చిందని, అప్పటికే కార్యక్రమం ముగిసి ఉంటుందని, నిర్వాహకులపై గౌరవంతో వారిని కలవడానికి వెళ్లానని చెప్పారు. సభ వేదికపై జోగి రమేష్‌ ఉండటం వైసీపీ వారు కావాలని చేసినది కూడా కావొచ్చన్నారు. గతంలో వీడియో కాన్ఫరెన్స్‌లలో చొరబడిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.

కార్యక్రమంలో జోగి రమేష్‌ను చూసి షాక్ అయ్యానని, గౌడ సంఘం కార్యక్రమం ఎలా నిర్వహించాలో తాను చెప్పలేనన్నారు. ఆహ్వాన సంఘం వైసీపీ నాయకులు రారని చెప్పారని, వారు ముందే వచ్చి వెళ్తారని భావించినట్టు చెప్పారు. నూజివీడు సభలో పాల్గొనడం కాకతాళీయంగా జరిగినదే తప్ప అందులో దురుద్దేశాలు లేవని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వనని పార్థసారథి వివరణ ఇచ్చారు.

బీసీ సంఘాల ఆగ్రహం…

మంత్రి పార్థసారథిపై టీడీపీ ముఖ్యనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కథనాలు రావడంపై సోషల్ మీడియాలో పలువురు బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడులో రాజకీయాలకు అతీతంగా జరిగిన దివంగత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి సారథి పాల్గొంటే తప్పేమిటని నిలదీస్తున్నారు. గతంలో వేర్వేరు పార్టీల నాయకులు ఒకే వేదికపై కలిసి పాల్గొన్న సందర్భాలు లేవా అని నిలదీస్తున్నారు.

ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి పదవిలో ఉన్న పార్థసారథిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాకు లీకులు ఇవ్వడం, దానిని వివాదం చేయడాన్ని బీసీ సంఘాలు తప్పు పడుతున్నాయి. మంత్రి పార్థసారథి విషయంలో జరుగుతున్న పరిణామాాలను కాంగ్రెస్‌ నాయకుడు కొలనుకొండ శివాజీ తప్పుపట్టారు. మంత్రిగా ఉన్న వ్యక్తిని తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించడం ఏమిటని ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం