Bapatla Boy Murder Case : బాపట్ల అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం
17 June 2023, 16:37 IST
- Bapatla Boy Murder Case : బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ పై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో రాజకీయ కోణంలేదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాలుడి కుటుంబానికి పరిహారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
బాపట్ల పదో తరగతి విద్యార్థి హత్య కేసు
Bapatla Boy Murder Case : బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ నేతలు, స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బాలుడి మృతదేహాన్ని రాజవోలు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చెరుకుపల్లి వద్ద అడ్డుకుని మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు 3 గంటలపాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రేపల్లె ఆర్డీవో పార్థసారథి చెరుకుపల్లి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో ఆందోళన గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళన విరమించారు. అమర్నాథ్ మృతదేహాన్ని ఉప్పాలవారిపాలెం తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
రాజకీయ కోణం లేదు- ఎస్పీ
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ ను ఓ యువకుడు పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన సోదరిని వేధిస్తున్నాడని, ప్రశ్నించినందుకు అమర్నాథ్ పై వెంకటేశ్వర్ రెడ్డి అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కీలక విషయాలను తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేశారని వెల్లడించారు. ఈ హత్యపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడిలో నలుగురు పాల్గొన్నారని ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్యలో పాల్గొన్నారని తెలిపారు. వారిలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. మరొకరు పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామన్నారు. సోదరిని వెంకటేశ్వర్ రెడ్డి వేధిస్తున్న విషయం అమర్నాథ్ అందరికీ చెప్పాడని కోపంతో వెంకటేశ్వర్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అమర్నాథ్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో రాజకీయకోణం ఏంలేదని, వ్యక్తిగతంగా జరిగిన ఘటనేనని ఎస్పీ తెలిపారు.
ఎంపీ మోపిదేవికి నిరసన సెగ
పాము వెంకటేశ్వర్ రెడ్డి గ్రామంలో తాపీపని చేస్తాడని తెలుస్తోంది. గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి తిరుగుతుంటాడని, వారి అండతోనే నేరాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. బాలుడు అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణను గ్రామస్తులు వెనక్కి పంపేశారు. ఎంపీ ఇస్తానన్న రూ. లక్ష సాయం వద్దని, మేమే లక్ష ఇస్తాం తిరిగి వెళ్లిపోవాలని గ్రామస్తులు అనడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు.