హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందే! కలెక్టర్‌కు వినతి పత్రమిచ్చిన బాలకృష్ణ
05 February 2022, 14:13 IST
- ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ను కలిసిన బాలకృష్ణ అనంతపురం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని, అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధమని ఆయన అన్నారు.
బాలకృష్ణ
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీ సత్యాసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులు హిందూపురాన్ని చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం నాడు మౌనదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం అనంతపురం జిల్లా కేంద్రానికి చేరింది. శనివారం నాడు అఖిలపక్ష నాయకులతో కలిసి భారీ ర్యాలీగా ఆయన కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పార్టీ కార్యక్తలు, అభిమానులు కూడా ఈ ర్యాలీలో భాగమయ్యారు. కాన్వాయి ద్వారా తన నివాసం నుంచి బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అంతేకాకుండా చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచి కూడా తెదేపా కార్యకర్తలు, అభిమానులు వాహనాల్లో కలెక్టరేట్‌కు వచ్చారు.
ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ను కలిసిన బాలకృష్ణ అనంతపురం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని, అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధమని ఆయన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేయడమనేది ప్రజల మనోభావానికి చెందిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉద్యమిస్తున్నారని, ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే స్పందించకుండా.. జిల్లాకు ఆయన పేరు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని స్పష్టం చేశారు
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ శుక్రవారం ఉదయం మౌనదీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. హిందూపురంలోని కనకదాస కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. జిల్లా కేంద్రంగా ఉండటానికి హిందూపురంలో అన్ని సౌకర్యాలు, అర్హతలు ఉన్నాయని.. ఈ సందర్భంగా అందరూ అభిప్రాయపడ్డారు.