AP Volunteers: వాలంటీర్లకు పురస్కారాలు… నేడు ఫిరంగిపురంలో నగదు ప్రోత్సహకాలు పంపిణీ అందించనున్న సిఎం జగన్
15 February 2024, 9:42 IST
- AP Volunteers: ఏపీలో వాలంటీర్లకు ఏటా ఇచ్చే నగదు పురస్కరాలను నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సిఎం జగన్ పంపిణీ చేయనున్నారు. నగదు ప్రోత్సహకాలను గతానికంటే పెంచుతున్న ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో వాలంటీర్లకు నగదు పురస్కారాలను విడుదల చేయనున్న సిఎం జగన్ (ఫైల్)
AP Volunteers: ఏపీలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు Volunteers నేడు నగదు ప్రోత్సహకాలు అందించనున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ CM Jagan వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వాలంటీర్లకు ఏటా ఇస్తున్న నగదు పురస్కారాలను ఈ ఏడాది పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో సేవావజ్రల Seva Vajraకు ఇచ్చే నగదు పురస్కారం రూ.30 వేల నుండి రూ.45 వేలకు పెంచారు. సేవారత్న Seva Ratna లకు రూ.20 వేల నుండి రూ.30వేలకు పెంపుదల చేశారు. సేవామిత్ర Seva Mithraలకు రూ.10వేల నుండి రూ.15వేలకు పెంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా నగదు పురస్కారాలు అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాదీ వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.
సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందచేశారు . ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు అందిస్తారు.
మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచారు.
కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనున్నారు. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందిస్తారు.
2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు..
ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
పురస్కారాలు ఇలా..
ప్రతి శాసనసభా నియోజకవర్గంలో మెరుగైన ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు.
సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు.
సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది.
ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్‌కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందచేయనున్నారు.