Pawan Kalyan : వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమే, వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్- పవన్ కల్యాణ్
01 October 2023, 19:09 IST
- Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పాండవులైన జనసేన-టీడీపీ కూటమి వైసీపీ కౌరవులను ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్
Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగో విడత వారాహి యాత్రలో భాగంగా ఆదివారం అవనిగడ్డ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమేనన్నారు. అయితే ఈ యుద్ధం మేం పాండవులు, వైసీపీ కౌరవులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిచి ఉంటే ఈరోజు డీఎస్సీ అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని నించోనే అవసరం వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో 30 వేల టీచర్ పోస్టులో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదని ఆరోపించారు.
"జగన్ దేవుడని ప్రజలు నమ్మారు. దెయ్యమై పీడిస్తున్నారు. ఈసారి మళ్లీ వైసీపీ గెలిస్తే ఒక తరం నష్టపోతుంది. ఈ రోజుల్లో నోరేసుకుని పడిపోయేవాళ్లు గొప్ప ఎమ్మెల్యేలు అయిపోయారు. పవన్ కల్యాణ్ కు పొగరు ఎక్కువ అంటారు... అది పొగరు కాదు ఆత్మగౌరవం. ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి వచ్చాడంటే అది నా ఆత్మగౌరవం"- పవన్ కల్యాణ్
వైసీపీ 15 సీట్లే
వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలపై కేసులు పెడతామన్న వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ కు సవాల్ చేస్తున్నా... తనపై కేసు పెట్టుకోవచ్చన్నారు. దేశభక్తులు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తామని సీఎం జగన్ కు సవాల్ చేశారు. వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్ అన్నారు. డీఎస్సీ నిరుద్యోగులను వైసీపీ ఫ్యానుకు ఉరివేశారన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ఛాన్సు తీసుకోదల్చులేనన్నారు. వచ్చే ఎన్నికలకు జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయన్నారు. వైసీపీకి 175కి 15 టికెట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తా
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ అద్భుతమైన పాలకుడైతే తనకు రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదన్నారు. డబ్బు, భూమి మీద నాకు ఎప్పుడూ కోరిక లేదన్నారు. ఈ పదేళ్లలో జనసేన పార్టీ అనేక దెబ్బలు తిందన్నారు. ఆశయాలు, విలువల కోసం జనసేన పార్టీ నడుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి స్థానం వస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. తప్పు జరిగితే గొడవ పెట్టుకునే మనస్తత్వం తనదన్నారు. పార్టీల కంటే రాష్ట్ర భవిష్యత్తు చాలా ముఖ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల యువత ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారన్నారు. సీఎం జగన్ రూ.వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైందన్నారు. జగన్ ఉన్నారని వైసీపీ నేతలు రెచ్చిపోతే వారికే నష్టం అన్నారు. అధికార మదంతో ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు. ఆనాడు చంద్రబాబుతో పాలసీ విధానాలపైనే విభేదాలు వచ్చాయన్నారు.