Bandaru Beach : ఏపీలో 100 అడుగుల మేర ముందుకు వచ్చిన సముద్రం.. దేనికి సంకేతం?
19 October 2024, 14:19 IST
- Bandaru Beach : ఏపీ తీరంలో సముద్రంలో అలజడి సృష్టిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ సముద్రం ముందుకు వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఓషనోగ్రఫీ నిపుణులు స్పందించారు. సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం సహజం అని వివరించారు.
మంగినపూడి బీచ్
బందరు సమీపంలోని మంగినపూడిలో అలల ఉద్ధృతి అలజడి రేపుతోంది. అలలు కట్టను దాటి 100 అడుగుల మేర ముందుకు వచ్చాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో బీచ్‌లో వ్యాపారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొబ్బరితోటను దాటి సముద్రపు నీరు దుకాణాల దగ్గరకు వచ్చింది.
మంగినపూడి బీచ్ సమీపంలో.. పోలీసులు ఔట్‌పోస్టుగా ఉపయోగించుకుంటున్న పాక.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కొబ్బరితోటలోని చెట్లు కూకటివేళ్లతో కూలిపోతున్నాయి. ఈ దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు నరసాపురం ప్రాంతంలో తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చినలంక, పీఎం లంక వద్ద 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. ఒడ్డున వున్న కొబ్బరి తోటలు, సరుగుడు తోటల్లోకి నీరు వచ్చి చేరింది. పెద్ద ఎత్తున వచ్చిన అలల హోరుకు ప్రజలు భయందోళన చెందుతున్నారు
అయితే.. సముద్రం ముందుకు రావడంపై ఓషనోగ్రఫీ నిపుణులు స్పందిస్తున్నారు. తీరంలోని ఆటుపోట్లు, అలల ఎత్తు పల్లాలు, వేగంలో తేడా ఇలాంటి మార్పులు ఏవైనా గమనించాలంటే, సముద్రాన్ని కనీసం ఆరు గంటల పాటు పరిశీలించాలని చెబుతున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం రోజూ రెండు సార్లు జరుగుతుందని వివరిస్తున్నారు.
సునామీ, తుపాన్లు, సముద్ర ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, సముద్రపు ప్రవాహాలు ఒక దిశ నుంచి మరో దిశకు మారే క్రమంలో.. సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం వంటివి జరుగుతూ ఉంటాయని.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయని.. ఈ గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్లినప్పుడు సముద్ర ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ.. తీరం నుంచి వెనక్కి తీసుకువెళతాయని వివరిస్తున్నారు.
మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే.. సముద్రపు నీరు ముందుకు వస్తుందని అంటున్నారు. ఇది వెంటనే జరగవచ్చని.. కొన్ని సందర్భాల్లో.. కొన్ని గంటలు, రోజులు సమయం పట్టవచ్చని అంటున్నారు. ఇది స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.