Visakha Boat Accident : వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు, సముద్రంలో దూకేసిన మత్స్యకారులు
Visakha Boat Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన మత్స్యకార బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో ఒక్కసారి మంటలు చెలరేగి పూర్తిగా వ్యాపించాయి. మత్స్యకారులు సముద్రంలోకి దూకగా, సమీపంలోని మరో బోటు సిబ్బంది గమనించి వారిని రక్షించారు.
Visakha Boat Accident : విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటులో ఒక్కసారిగా మంటలకు చెలరేగాయి. ఇంజిన్ లో ఏర్పడిన మంటలు బోటు మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. సుమారు రూ.40 లక్షలు వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోతున్నారు.
మత్స్యకార బోటులో అగ్ని ప్రమాదం
విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన బోటు వేటకు వెళ్లి అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఐదుగురు మత్స్యకారులతో బయల్దేరిన బోటు సముద్రంలోకి వెళ్లగానే మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి గురైన బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. మత్స్యకారులు వెంటనే సమీపంలోని బోట్లకు సమాచారం అందించారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బోటుకు సమీపంలో మరో బోటు ఉండడంతో మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ బోటులోని ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిని సమీపంలోని మరో బోటు సిబ్బంది గుర్తించి రక్షించారు.
బోటు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని విశాఖ మత్స్యశాఖ అధికారి మంత్రికి తెలియజేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
విశాఖ కంటైనర్ టెర్మినల్ లో స్వల్ప అగ్ని ప్రమాదం
విశాఖలోని కంటైనర్ టెర్మినల్‌లో శనివారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్‌లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత నెలలో చైనా నుంచి వచ్చిన కంటైనర్ కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. దానిని ట్రాలర్‌పై లోడ్ చేసిన సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోర్టు సిబ్బంది అంతర్గత విచారణ చేపట్టింది. ఈ కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ కంటైనర్ టెర్మినల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంతో వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై అక్కడి నుంచి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ విశాఖలోని కంటైనర్ టెర్మినల్ లో జరుగుతోంది.
సంబంధిత కథనం