Sports quota Job: విభిన్న ప్రతిభావంతురాలికి ప్రభుత్వ ఉద్యోగం
27 September 2023, 9:33 IST
- Sports quota Job: క్రీడల్లో రాణిస్తున్న కర్నూలుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు జఫరీన్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ఏపీ అసెంబ్లీ అమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో ప్రకటించారు.
క్రీడాకారిణి జఫరీన్‌తో మంత్రి బుగ్గన
Sports quota Job: కర్నూలుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు జఫరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగంలో నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సవరణ బిల్లు-2023ను శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో క్రీడల్లో రాణించే వారిని గుర్తించి ప్రోత్సహించడం, తద్వారా రాష్ట్ర యువతలో స్ఫూర్తి నింపడమే ఈ బిల్లు సవరణ ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు.
'ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీమ్ కి కెప్టెన్'గా షేక్ జఫరీన్ అనే విభిన్న ప్రతిభావంతురాలు సాధించిన విజయాల గురించి మంత్రి బుగ్గన సభలో వెల్లడించారు. వినికిడి లోపంతో ఉన్న జఫరీన్ 2020లో ఆమె జాతీయస్థాయి పురస్కారం గెలిచిందన్నారు. కర్నూలు ఉస్మానియా కాలేజీలో ఆమె డిగ్రీ పూర్తి చేసిన జఫరీన్ ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ మెహిదీపట్నంలోని మహిళా సెంట్ ఆన్స్ కాలేజీలో ఎంసీఏ విద్యనభ్యసిస్తుందని వివరించారు.
జనవరి 2019లో చెన్నైలో జరిగిన 23వ జాతీయ స్థాయి పోటీల్లో టెన్నిస్ (ఉమెన్ సింగిల్స్, మిక్స్ డ్ డబుల్స్)లో విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో రెండు స్వర్ణాలు సాధించినట్లు తెలిపారు. 2016లో స్లొవేనియా దేశంలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్, 2018లో స్లొవేనియా దేశంలో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్, 2017లో టర్కీలోని సామ్సన్ సిటీలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్, 2022 మేలో బ్రెజిల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రీడల పోటీల్లో (డెఫ్ ఒలింపిక్స్-2021) బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 20 అత్యున్నత పురస్కారాలందుకున్న జఫరీన్ కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారిణి కావడం గర్వకారణమని మంత్రి బుగ్గన ప్రశంసించారు. భారతదేశం గర్వించదగిన క్రీడాకారిణిగా టెన్నిస్ క్రీడా పోటీలలో విజృంభిస్తోన్న జఫరీన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగమిస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు.
వ్యవసాయ శాఖకు చెందిన కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటి రిజిస్ట్రార్ గా నియమిస్తున్నట్లు వివరించారు. జఫరీన్ లాంటి ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బిల్లును సవరించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు.