APSRTC DASARA Special: దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సు సర్వీసులు, సాధారణ ఛార్జీలే అమలు
01 October 2024, 6:03 IST
- APSRTC DASARA Special: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది.
దసరా పండుగ కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు
APSRTC DASARA Special: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతోంది.నవరాత్రుల్లో తిరుమల సహా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రాధాన్యత ఇచ్చింది. దసరా సందర్భంగా పెద్దఎత్తున ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ, ఈ మేరకు అన్ని రకాలు ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించారు. టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేస్తారు. ఈ సారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఎసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
6,100 ప్రత్యేక బస్సులు:
శరన్నవరాత్రులు సహా దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవీ ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఆ మేరకు అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఈ నెల 3 నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పట్నుంచీ బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 6 వేల 100 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ సిద్ధం చేసింది. దసరా పండుగ ముందు రోజుల్లో ఈనెల 4 నుంచి 11 వరకు 3,040 బస్సులు ఏర్పాటు చేసింది. దసరా పండుగ తర్వాత రోజుల్లో ఈ నెల 12 నుంచి 20 వరకు 3,060 బస్సులు నడపాలని నిర్ణయించారు.
ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే:
ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలు, సహా ముఖ్య నగరాలు, పట్టణాలు ,ఆధ్యాత్మిక కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు , భద్రాచలం తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, సహా పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకూ రాను పోను ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులపై భారం మోపకూడదని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం, ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆదేశించింది.
ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం:
అన్ని బస్సుల్లోనూ సాధారణ బస్సు టికెట్ల ధరనే వసూలు చేయాలని ఎండీ అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ చేశారు. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ఎండీ వెల్లడించారు. నవరాత్రుల్లో బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు.
సాధారణ భక్తులతో పాటు భవానీలు పెద్దఎత్తున తరలివస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి అత్యధికంగా వస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఆయా బస్ డిపోల నుంచి అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
చిల్లర చింత లేదు:
హైదరాబాద్, సహా పలు నగరాల నుంచి సైతం ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారని భావించి విజయవాడ మీదుగా వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ సహా హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల ప్రణాళికను రూపొందించనప్పటికీ అప్పటికప్పుడు ఊహించని రీతిలో రద్దీ వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సులను సిద్దంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.
అన్ని జిల్లాల నుంచి విజయవాడకు 1100 బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మిషిన్ల ద్వారా ఫోన్ పే, గుగూల్ పే, సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డులు, ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.
ఛార్జీలో 10 శాతం రాయితీ:
ప్రత్యేక బస్సుల్లో రాను పోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10 శాతం రాయీతీని వర్తింపజేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ సారి విజయవాడ - హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ ఎసీ బస్సుల్లో టికెట్‌పై 10 శాతం ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రమంతటా... అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలు, ప్రాంతాలకు
సాధారణ రోజులలో APSRTC అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు మరియు రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళూరు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 6,100 ప్రత్యేక బస్సులు నడపబడతాయి.
ఎక్కడినుంచి ఎక్కడకు? ఎన్నెన్ని బస్సులు?
దసరా పండుగ ముందు రోజులలో హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 275 బస్సులు, చెన్నై నుండి 65 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 320 బస్సులు, రాజమండ్రి నుండి 260 బస్సులు, విజయవాడ నుండి 400 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 730 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.
దసరా తర్వాత రోజులలో
హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 330 బస్సులు, చెన్నై నుండి 70 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 260 బస్సులు, రాజమండ్రి నుండి 220 బస్సులు, విజయవాడ నుండి 700 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 490 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.
ఈసారి ప్రత్యేకం ఏమిటి?
ప్రయాణికులపై భారం మోపకూడదనే ఉద్దేశ్యంతో ఈ సారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా, బస్సులు, అధికారులు, సిబ్బంది సంసిద్ధం చేశారు. నవరాత్రులలో విజయవాడ కనక దుర్గ గుడికి ఎక్కువ మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నందున వారి రద్దీని బట్టి బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేసింది. కళాశాలలకు, పాఠశాలలకు, వరుస సెలవులు మరియు ఉద్యోగులకు వరుస సెలవులు కారణంగా ప్రయాణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. స్వస్థలాలకు రావడానికి, తిరిగి వెళ్ళడానికి APSRTC బస్సుల మీద ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడతారు. ఈ కారణంగా అన్ని జిల్లాల నుండి విజయవాడకు 1100 బస్సులు నడిపి రవాణా సేవలు అందించేందుకు APSRTC అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
పర్యవేక్షకులుగా ఆఫీసర్లు, సూపర్వైజర్లు
ఈ సర్వీసుల పర్యవేక్షణకై జిల్లా ముఖ్య కేంద్రాలు మరియు హైదరాబాద్ లలో పలు పాయింట్ల వద్ద అధికారులు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులునిర్వహిస్తారు. అన్ని బస్సులకు GPS ట్రాకింగ్ మరియు 24x7 సమాచారం/ సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 మరియు 0866-2570005 అందుబాటులో ఉంటాయి.
శ్రీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భముగావారి
శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భముగా ఏ.పి. ఎస్ ఆర్ టి సి భక్తుల రద్దీ కి అనుగుణముగా 4.10.2024 నుండి 12. 10 2024 వరకు ప్రతి రోజు 1930 ట్రిప్పు లను తిరుపతి నుండి తిరుమలకు త్రిప్పుటకు తగు ఏర్పాట్లను చేసినది. గరుడ సేవ మరియు తరువాత రోజు అనగా 8 .10. 2024 మరియు 9.10 2024 తేదీలలో 2,714 ట్రిప్పు లను త్రిప్పుటకు తగు ఏర్పాట్లను చేసింది.