తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Dasara Special Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5500 ప్రత్యేక బస్సులు!

APSRTC Dasara Special Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5500 ప్రత్యేక బస్సులు!

04 October 2023, 15:26 IST

google News
    • APSRTC Dasara Special Buses : దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రయాణికుల కోసం 5500 ప్రత్యేక బస్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

ఏపీఎస్ఆర్టీసీ

APSRTC Dasara Special Buses : తెలుగు రాష్ట్రాల్లో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన వాళ్లు పండుగ పూట సొంతఊర్లకు క్యూకడతారు. దీంతో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ దసరా పండుగకు ఊళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 26వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

విజయవాడకు ప్రత్యేక సర్వీసులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తారు. దసరా పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్ని నడిపించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. విజయవాడ నుంచి అన్ని ప్రధాన ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడిపించనుంది.

అడ్వాన్స్ బుకింగ్ పై 10 శాతం రాయితీ

అక్టోబర్ 13 నుంచి 22వ తేదీ వరకు అంటే దసరా ముందు రోజుల్లో 2700 ప్రత్యేక బస్సులు నడపనుంది. పండుగ రోజులైన 23 నుంచి 26 వరకు 2800 బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ నుంచి 2050 ప్రత్యేక బస్సులు, బెంగుళూరు నుంతి 440, చెన్నై నుంచి 153 బస్సులు ఏపీలోని పలు పట్టణాలకు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 1137 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి 480 బస్సులు,రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుంచి 885 బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పండుగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ పై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఆన్ లైన్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ను అంగీకరిస్తామని ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు

దసరా పండుగకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

తదుపరి వ్యాసం