Congress President Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం
16 January 2024, 15:23 IST
- Congress President Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తున్నట్లు ఏఐసిసి ప్రకటించింది. కాంగ్రెస్ నిర్ణయంపై షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి
Congress President Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు.
తెలంగాణ వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని రెండేళ్ళ క్రితం స్థాపించిన వైఎస్ షర్మిల... కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని బావించినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండేలా ఆమెను ఒప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నెల రోజుల్లోపే ఢిల్లీ వేదికగా ఆమె హస్తం కండువా కప్పేసుకున్నారు. తాజాగా ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
గిడుగు రాజీనామా...సిడబ్ల్యుసిలో చోటు
ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు సోమవారం తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు.
అమలాపురం పట్టణానికి చెందిన గిడుగు రుద్రరాజు... 2022 నవంబరులో ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా... 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. గతంలో ఒడిశా రాష్ట్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు.
గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో... వైఎస్ షర్మిల కోసమే తప్పుకున్నారని ప్రచారం జరిగింది. అంతా భావించినట్టే పదవి నుంచి తప్పుకున్న 24గంటల్లోనే షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. నిన్న, మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న షర్మిల.. ఇకపై ఆంధ్రా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడి వివాహం తర్వాత షర్మిల పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నారు.
షర్మిల ప్రస్థానంలోని పలు విషయాలు:
- ప్రస్తుతం 49 ఏళ్ల వైఎస్ షర్మిల.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి అవుతారు.
- 2009లో విమాన ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి యాత్రను ప్రారంభించారు. అయితే దీనికి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
-షర్మిల కూడా 2020 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భాగంగానే పని చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు... పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు.
-2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల... తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు.
-ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. అంతేకాకుండా... తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. కొత్త పార్టీ పెట్టిన ఏడాది తర్వాత ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తన కుమారుడి పార్టీ అయిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించారు.
షర్మిల కృతజ్ఞతలు…
పిసిసి అధ్యక్షురాలిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీవేణుగోపాల్‌కు… వైఎస్ షర్మిల ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవంగా తీసుకొచ్చేందుకు నమ్మకంగా పని చేస్తానని ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్, మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.