తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court: ఏపీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేకాధికారి నియామకం చెల్లదన్న హైకోర్టు

Ap High Court: ఏపీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేకాధికారి నియామకం చెల్లదన్న హైకోర్టు

HT Telugu Desk HT Telugu

25 August 2023, 10:02 IST

google News
    • Ap High Court: పాలక మండలి గడువు ముగిసిన తర్వాత ఏపీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించడం చట్ట ప్రకారం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్‌బోర్డుకు తక్షణం పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
వక్ఫ్‌ బోర్డు స్పెషలాఫీసర్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్ట
వక్ఫ్‌ బోర్డు స్పెషలాఫీసర్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్ట

వక్ఫ్‌ బోర్డు స్పెషలాఫీసర్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్ట

Ap High Court: ఆంధ్రప్రదేవ్‌ వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చట్టప్రకారం ప్రత్యేకాధికారిని నియమించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవని తేల్చి చెప్పింది. వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేక అధికారిగా షిరీన్‌బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15న జారీచేసిన గెజిట్‌ ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక అధికారిని నియమించే అధికారం చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ దర్గా ముతవల్లీపై ఆరోపణలు రావడంతో ఆ పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రత్యేక అధికారి హోదాలో షరీన్ జారీచేసిన ఉత్తర్వులనూ హైకోర్టు రద్దు చేసింది. కొత్త వక్ఫ్‌బోర్డు ఏర్పాటుచేసే వరకు బోర్డు రోజువారీ కార్యకలాపాలను చూసుకునేందుకు మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిని పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించాలని ఆదేశించింది.

కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు వక్ఫ్‌బోర్డుకు చెందిన విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోవడానికి వీల్లేదని అడ్మినిస్ట్రేటర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత కీలక తీర్పు ఇచ్చారు.

ఏపీ వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారి నియామకంపై ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలోని దర్గాకు చెందిన ముతవల్లీ హఫీజ్‌ పాషా హైకోర్టులో రెండు వేర్వేరు వ్యాజ్యాలు వేశారు. తనను సస్పెండ్‌ చేస్తూ ప్రత్యేక అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఓ పిటిషన్‌లో అభ్యర్థించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం లేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు. పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించారు.

వక్ఫ్‌బోర్డు కాలపరిమితి ఈ ఏడాది మార్చి 12తో ముగిసిందని న్యాయమూర్తి సుజాత గుర్తుచేశారు. బోర్డు చట్టబద్ధమైన విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడే వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 99 ప్రకారం బోర్డును ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునే అధికారం ఉందని వివరించారు. కాలపరిమితి ముగిసిన వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించే వెసులుబాటు ప్రస్తుత చట్టంలో లేదన్నారు.

గడువు ముగిసిన వెంటనే కొత్తబోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. వక్ఫ్‌బోర్డుకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడానికి ప్రభుత్వం సహేతుకమైన కారణాలను చూపించలేదన్నారు. పంచాయతీలకు కాలపరిమితి ముగిస్తే ప్రత్యేక అధికారులను నియమించే వెసులుబాటు పంచాయితీరాజ్‌ చట్టంలో ఉందని, వక్ఫ్‌ చట్టంలో అలా ప్రత్యేక అధికారిని నియమించే నిబంధన లేదన్నారు.

వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారి నియామకమే చట్ట విరుద్ధమైతే, ముతవల్లీని సస్పెండ్‌ చేస్తూ ఆ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. మరోవైపు కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వక్ఫ్‌ బోర్డు కార్యాలయానికి హాజరవుతున్న ప్రత్యేకాధికారిణిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ధిక్కర పిటిషన్‌ దాఖలు చేయాలని ముస్లిం నేతలు భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం