AP TS Dasara Holidays : ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్-భారీగా దసరా సెలవుల ప్రకటన
02 October 2023, 14:20 IST
- AP TS Dasara Holidays : ఏపీ, తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణలో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
స్కూళ్లకు దసరా సెలవులు
AP TS Dasara Holidays : ఏపీ, తెలంగాణ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు. తెలంగాణలో దసరా,బతుకమ్మ పండుగలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దీంతో పాఠశాలలు, కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది. అక్టోబర్ లో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అక్టోబర్ వచ్చిందంటే పండగే.
13 రోజులు సెలవులు
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ లో దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా, ఈసారి మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రజలు అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది.
ఏపీలో దసరా సెలవులు
ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి 24 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 25న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు గంట ముందు స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులకు పేపర్ల పంపాలని ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పొద్దున్న, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. 6,7,8 తరగతుల విద్యార్థుల మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించగా, 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం పూట నిర్వహిస్తారు. అక్టోబర్ 10వ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు తెలియజేస్తారు.