AP IAS Officer Issue: సస్పెండ్ చేస్తే చేసుకో, రెస్ట్ తీసుకుంటామంటున్న టీచర్లు
27 October 2023, 7:47 IST
- AP IAS Officer Issue: ఏపీలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తీరుతో విసిగిపోయిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తీసుకోవాలని తెగేసి చెబుతున్నారట. ఉపాధ్యాయుల్ని క్రమశిక్షణ పేరుతో శిక్షిస్తే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం కానీ బెదిరింపులతో నిత్యం భయపడుతూ పనిచేయలేమనే స్థితికి వచ్చేశారు.
ఐఏఎస్ అధికారి బెదిరింపులపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం
AP IAS Officer Issue: ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు ఏపీలోని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటానని చెప్పుకునే సదరు అధికారి కొంతకాలంగా విద్యాశాఖను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ పాఠశాలల్ని తనిఖీ చేస్తున్నారు.
ఏకంగా విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి నోట్‌బుక్స్ తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారో వాకబు చేస్తున్నారు. పనితీరులో వెనుకబడిన వారికి తాఖీదులు ఇస్తున్నారు. అధికారి దూకుడుతో మొదట్లో ఒకరిద్దరి బీపీలు పెంచుకుని ఆస్పత్రుల పాలయ్యారు. ఇటీవలి కాలంలో స్పీడ్ కాస్త తగ్గించినా ఆ ధోరణి మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయులకు మోటివేషన్ పేరుతో సదరు అధికారి ప్రసంగాలకు సంబంధించిన యూట్యూబ్ లింకుల్ని ఉపాధ్యాయులకు పంపి వాటి మీద ప్రశ్నలు వేస్తుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
సంస్కరణల్లో భాగమేనా…
ఏపీ ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతోంది. వీటి ఫలితాలు కనిపించడానికి మరికొన్నేళ్ల సమయం పట్టొచ్చు. పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌తో పాటు ఇటీవల ఐబి బోధనకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కూడా ఇస్తోంది. నాడు నేడు ద్వారా పాఠశాలల మరమ్మతులకు వేల కోట్ల రుపాయలు వెచ్చిస్తోంది. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం చేపడుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా ఫలితాలు రాకపోవడానికి ఉపాధ్యాయులే కారణమనే భావన కొందరు అధికారుల్లో ఉంది.
దీంతో బోధనా విధానంలో కూడా సంస్కరణలు చేపట్టింది. విద్యాశాఖలో సంస్కరణల అమలు తీరును పరిశీలించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారి తరచూ పాఠశాలల్ని తనిఖీ చేస్తున్నారు. విద్యాబోధన మొదలుకుని, నోట్ పుస్తకాల కరెక్షన్ వరకు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులు, సదుపాయాలు, నాడునేడు పథకం అమలు తదితర అంశాల ఆధారంగా ప్రతి మండలంలో ప్రతి వారం తనిఖీలు చేపడుతున్నారు.
ఇదంతా చూడ్డానికి బాగానే ఉన్నా పాఠశాలలను తనిఖీ చేసే క్రమంలో సదరు అధికారి అందరి ముందు టీచర్లను చులకన చేయడం, సస్పెండ్ చేస్తా, షోకాజ్ ఇస్తానని బెదిరించడంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ఇటీవల విజయవాడలో సమ్మెటివ్ 1 పరీక్ష పత్రాల మూల్యాంకనం దసరా సెలవులకు ముందే పూర్తి చేయకపోవడంతో కొందరు అధ్యాపకులకు షోకాజ్ జారీ చేయడం ఉపాధ్యాయుల్లో చర్చగా మారింది.
విజయవాడ మొగల్రాజపురంలో ఉన్న హై స్కూల్లో సమ్మెటివ్1 పరీక్ష పేపర్లు దిద్దలేదని ముగ్గురి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ అధికారి ఆదేశించారు. విజయవాడ నగరంలో అడ్మిషన్లకు బాగా డిమాండ్ ఉన్న మునిసిపల్ స్కూళ్లలో అది కూడా ఒకటి. ఉపాధ్యాయులు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం లేకపోవడంతో పాఠాలు చెప్పడం కంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండటం మేలని మిన్నకుండిపోయారని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై నిరంతరం ఒత్తిడికి గురి చేసేలా సాగుతున్న వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చగా మారింది.దసరా సెలవులకు ముందే పరీక్షా పత్రాల మూల్యాంకనం చేసి ఆన్‌లైన్ అప్డేట్ చేయనందుకు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇతర పనుల ఒత్తిడి వల్ల పూర్తి చేయలేకపోయామని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉపాధ్యాయులు మిన్నకుండిపోయినట్టు తెలుస్తోంది.
నాడు నేడు పనులు జరుగుతున్న స్కూళ్ల తనిఖీ పేరుతో హడావుడి చేయడం, ఉపాధ్యాయుల్ని అందరి ముందు దుర్భాషలాడటం, ఏదైనా తప్పులు దొర్లితే ఎక్కడెక్కడి నుంచో సెక్రటెరియట్‌కు వచ్చి వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించడం వంటి చేష్టలతో ఇప్పటికే ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఐఏఎస్ అధికారి వస్తున్నాడంటే హడలిపోయే పరిస్థితి వచ్చేసింది. స్కూళ్లలో తనిఖీలు చేయడానికి వచ్చే సందర్భంలో తాను ఎక్కడెక్కడ ఎలా పనిచేశానో చెబుతూ టీచర్లకు క్లాస్ తీసుకోవడం సదరు అధికారికి అలవాటై పోయిందట.
ఇకపై ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తామంటే వెంటనే ఓకే చెప్పాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా సలహా ఇస్తున్నాయి.ఉపాధ్యాయులు లేకపోతే బడుల్లో సదరు ఐఏఎస్ వచ్చి పాఠాలు చెబుతారని,టీచర్ల కష్టం అప్పుడు తెలుస్తుందని చెబుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఎక్కడైనా పాఠశాలల తనిఖీల్లో ఏ చిన్న తప్పు దొరక్కపోతే అక్కడి డిఈఓ బలైపోతారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేని బడికి తీసుకొచ్చి తన టైమ్ వేస్ట్ చేశావని డిఈఓలను ఆ అధికారి క్లాస్ పీకడం రివాజుగా మారిందట.