తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Student Died In Bihar : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహ‌త్య, నిట్ డైరెక్టర్ రాజీనామాకు విద్యార్థుల డిమాండ్

AP Student Died In Bihar : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహ‌త్య, నిట్ డైరెక్టర్ రాజీనామాకు విద్యార్థుల డిమాండ్

HT Telugu Desk HT Telugu

21 September 2024, 18:13 IST

google News
    • AP Student Died In Bihar : అనంతపురం జిల్లాకు చెందిన యువతి బీహర్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో చదువుతోంది. అయితే శుక్రవారం రాత్రి ఏపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహ‌త్య
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహ‌త్య (photo source unshplash.com)

పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహ‌త్య

AP Student Died In Bihar : బీహార్‌లోని పాట్నాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహ‌త్యకు పాల్పడింది. దీంతో యాజ‌మాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళ‌నకు దిగారు.

బీహార్ రాజ‌ధాని పాట్నా శివారులోని బిహ్తాలో ఉన్న ఎన్ఐటీ క్యాంప‌స్‌లో ఏపీలోని అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌ల్లవి రెడ్డి (20) శుక్రవారం రాత్రి త‌న హాస్టల్‌ గ‌దిలో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. గ‌తేడాదే క్యాంప‌స్‌లో చేరిన‌ పల్లవి రెడ్డి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో రెండో సంవత్సరం చదువుతోంది. ప‌ల్లవితో బిహ్తా క్యాంప‌స్‌లోని కాదంబిని హాస్టల్‌ గ‌దిలో మ‌రో ఇద్దరు విద్యార్థినీలు ఉంటున్నారు. ఆ రోజంతా ఆమె సంతోషంగా ఉంద‌ని రూమ్ మేట్స్ తెలిపారు. పల్లవి ఆరోజు సాధారణంగానే ఉందని, ఎలాంటి డిప్రెషన్‌కు గురికాలేదని తోటి విద్యార్థిని పేర్కొంది.

అయితే శుక్రవారం రాత్రి భోజ‌నానికి త‌న రూమ్స్‌మెట్స్‌ను పంపి ఆమె ఉండిపోయింది. ఇద్దరు రూమ్స్‌మేట్స్ భోజ‌నం చేసి తిరిగి రూమ్ వ‌ద్దకు వ‌చ్చే స‌రికి ప‌ల్లవి ఆత్మహ‌త్య చేసుకుని క‌నిపించింది. దీంతో రూమ్‌మేట్స్ ఇద్దరూ కేక‌లు వేశారు. స‌మాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇతర విద్యార్థినులు యాజ‌మాన్యానికి స‌మాచారం ఇచ్చారు. యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. స‌మాచారం అందుకున్న కాలేజీ యాజ‌మాన్యం, పోలీసులు హుటాహుటిన హాస్టల్ కు చేరుకున్నారు. గ‌దికి లోప‌ల వైపు గ‌డియపెట్టి ఉండడంతో త‌లుపుల‌ను ప‌గ‌ల‌గొట్టారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్న ప‌ల్లవిని కింద‌కు దింపి, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎవ‌రూ ఆమె ప‌ల్స్ కూడా చెక్ చేయ‌లేద‌ని, ఆమెను వెంట‌నే డాక్టర్ ద‌గ్గర‌కు తీసుకెళ్లార‌ని, మ‌మ్మల్ని గ‌దిలోకి వెళ్లనీయ‌లేద‌ని ఓ విద్యార్థిని తెలిపింది.

మృతురాలి స్వస్థలం ఏపీ అని, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచార‌మిచ్చిన‌ట్లు బిహ్తా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రాజ్ కుమార్ పాండే శ‌నివారం తెలిపారు. ఘ‌ట‌నా స్థలంలో సూసైడ్ నోట్ ల‌భ్యమైంద‌ని, ఆ దిశ‌గా కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆమె మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దానాపూర్ స‌బ్ డివిజ‌న‌ల్‌ ఆసుప‌త్రికి త‌రలించామ‌ని, త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. పోస్ట్‌మార్టం అనంత‌రం మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్పగిస్తామ‌ని అన్నారు.

పాట్నా సిటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ (వెస్ట్‌) శ‌ర‌త్ ఆర్ఎస్ మాట్లాడుతూ పోలీసుల‌కు స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు, 112 డ‌య‌ల్ టీమ్ ఘ‌ట‌నా స్థలానానికి చేరుకున్నారని, విద్యార్థిని మొద‌ట బిహ్తాలోని ఈఎస్ఐసీ ఆసుప‌త్రికి తీసుకొచ్చార‌ని, వైద్యులు ఆమె చనిపోయిన‌ట్లు నిర్ధారించాల‌ని అన్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘ‌ట‌నా స్థలానికి చేరుకుందని, సాక్ష్యాల‌ను సేక‌రించేందుకు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు.

ఆమె మానసిక ఒత్తిడికి గురుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పాట్నా సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) రాజీవ్ మిశ్రా తెలిపారు. ఆమె సూసైడ్ నోట్‌లో త‌న త‌ల్లిదండ్రులు, సోద‌రుడు, పాత పాఠ‌శాల‌, ఇన్స్టిట్యూట్ అధ్యప‌కుల‌ను ప్రస్తావించింద‌ని, వారికి కృత‌జ్ఞత‌లు తెలిపింద‌ని అన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని, స‌మ‌గ్ర విచార‌ణ త‌రువాత ఆమె ఆత్మహ‌త్య వెనుక ఉన్న అస‌లు కార‌ణం తెలుస్తుంద‌ని పేర్కొన్నారు.

అయితే విద్యార్థిని మృతికి గ‌ల ఖ‌చ్చిత‌మైన కార‌ణం ఇంకా తెలియ‌జేయలేదు. మ‌రోవైపు విద్యార్థి ఆత్మహ‌త్య వార్త తెలియ‌డంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్యాంప‌స్ వెలుప‌ల ఆందోళ‌న చేట్టారు. యాజ‌మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేప‌ట్టారు. కళాశాల అధికార యంత్రాంగం విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. సరైన సౌకర్యాలు లేని బిహ్తా ఆధారిత హాస్టళ్లలో విద్యార్థులు ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప‌ట్టించుకోని నీట్ పాట్నా డైరెక్టర్ పీకే జైన్ రాజీనామా చేయాల‌ని విద్యార్థులు డిమాండ్ చేశారు. సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతో విద్యార్థులు తమ హాస్టళ్లకు తిరిగి వచ్చారు. విద్యార్థుల‌ నిరసనల నేపథ్యంలో క్యాంపస్‌లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం