AP Govt : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా… ఉత్తర్వులు జారీ
08 August 2024, 20:45 IST
- AP Govt News: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లోనే మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నుంచి ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించింది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 2023 అక్టోబర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈడబ్ల్యుఎస్ కోటా కింద పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అనుబంధ గుర్తింపు పొందిన అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదు. అలాగే మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంది.
నాలుగు కాలేజీల్లో ప్రవేశాలపై సస్పెన్స్…!
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలపై సస్పెన్స్ వీడలేదు. ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి వచ్చే అనుమతులపై చర్చ కొనసాగుతోంది. పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు, మార్కాపురం మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు పూర్తి స్థాయి అనుమతుల రాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఐదు కాలేజీల ప్రిన్సిపాల్స్ అప్పీల్ చేశారు.
అయితే గుర్తించిన లోపాలను సరిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందుల కాలేజీలో 50 శాతం సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. మిగిలిన నాలుగు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతిపై మెడికల్ కమిషన్ స్పందన లేదు. ప్రతి మెడికల్ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్‌లో వంద సీట్ల భర్తీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో దరఖాస్తు చేసింది.