తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Chandrababu Remand: చంద్రబాబు అంచనాలకు అందని ఏపీ రాజకీయం

TDP Chandrababu Remand: చంద్రబాబు అంచనాలకు అందని ఏపీ రాజకీయం

HT Telugu Desk HT Telugu

25 September 2023, 7:11 IST

google News
    • TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదివారం రిమాండ్ పొడిగించింది. అక్టోబర్‌ 5వరకు బాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే  ఉండాలని  ఏసీబీ కోర్టు జడ్జి రిమాండ్ పొడిగించారు. 
ఏసీబీ కోర్టులో చంద్రబాబు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు

ఏసీబీ కోర్టులో చంద్రబాబు

TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్‌‌ను ఆదివారం ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని భావించిన టీడీపీకి రోజులు గడిచిపోతున్నా ఫలితం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని రోజులు చంద్రబాబును రిమాండ్‌లో ఉంచుతారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో క్యాడర్‌ కూడా అయోమయానికి గురవుతోంది.

సెప్టెంబర్‌ 9వ తేదీన చంద్రబాబును సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్ట్‌ చేశారు. పదో తేదీ రాత్రి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా న్యాయవాదుల్ని పిలిపించినా ఫలితం లేకపోయింది. సిద్ధార్థ లుథ్రా, హరీష్‌ సాల్వే వంటి వారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. చంద్రబాబు సమర్థత మీద బోలెడు నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ వర్గాలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ మాత్రం మింగుడు పడటం లేదు.

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు తరలించిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరై పోతుందని, ఆయనపై పెట్టిన కేసుల్ని హైకోర్టు కొట్టేస్తుందని టీడీపీ నేతలు భావించారు. అయితే ఈసారి అలా జరగలేదు. చంద్రబాబు ఊహించని విధంగా ఆయనకు సానుకూలంగా ఎలాంటి ఉపశమనం కోర్టుల్లో లభించలేదు.

నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇప్పుడు ఎదుర్కొంటున్నంత గడ్డు పరిస్థితుల్ని మునుపెన్నడూ చూసి ఉండరు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికి ఎంత సమయం పడుతుందనే విషయంలో కూడా స్పష్టత లేదు. వైసీపీ వర్గాలు మాత్రం సంక్రాంతి వరకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని ప్రచారం చేస్తున్నారు.

దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్ దాటుకుని పండుగలన్నీ పూర్తయ్యే దాకా బాబు రాజమండ్రిలోనే ఉండాల్సి రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నుంచి చంద్రబాబు బయటపడినా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుతో పాటు, అంగళ్లు ఘర్షణల కేసుల నుంచి కూడా చంద్రబాబు బయట పడాలి. ఏక కాలంలో ఇన్ని కేసుల నుంచి ఉపశమనం వేగంగా లభించడంపైనే సందేహాలు నెలకొన్నాయి. వీటితో పాటు కొత్త కేసులు నమోదు చేసే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. చంద్రబాబును బయటకు రానివ్వకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తే మరిన్ని కేసుల్ని టీడీపీ అధినేత ఎదుర్కోవాల్సి రావొచ్చు.

వైసీపీ వ్యూహం అదేనా….

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ ఎదుర్కొంటున్న పరిస్థితిని వైసీపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పటి నుంచి పక్షం రోజులుగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నెలకొని ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌, పొలిటికల్ కన్సల్టెంట్లు, పార్టీ క్యాడర్‌ నుంచి ఎప్పటి కప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. చంద్రబాబు అరెస్ట్‌పై జనం నుంచి వచ్చే స్పందన ఆధారంగా ముందుకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది.

బాబు అరెస్ట్‌ తర్వాత ముఖ్యమైన నాయకులు రోడ్లు ఎక్కి ఆందోళన చేయకుండా కట్టడి చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. శాంతి భద్రతల్ని అదుపు చేసే క్రమంలో అన్ని ప్రాంతాల్లో సెక్షన్ 30, 144వంటి నిషేదాజ్ఞల్ని అమల్లోకి తెచ్చారు. టీడీపీ ముఖ్య నాయకుల్ని కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడంతో ఆందోళనలకు అవకాశం లేకుండా పోయింది. ఇది ఆ పార్టీ క్యాడర్‌ మీద కూడా ప్రభావం చూపింది.

చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని చివరకు సామాజిక సమస్యగా చిత్రించడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. మరోవైపు ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ అనుగుణంగా ముందుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం సానుభూతిగా మారనంత వరకు ఆయన్ని జైల్లోనే ఉంచాలని భావిస్తున్నారు. తద్వారా రాజకీయంగా టీడీపీకి దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా చేయాలని భావిస్తోంది.

తదుపరి వ్యాసం