Botsa on PRC| ఫిట్‌మెంట్‌పై చర్చలు ఉండవు.. అది ముగిసిపోయింది: మంత్రి బోత్స
05 February 2022, 13:14 IST
- “ఫిట్‌మెంట్ అనేది ముగిసిపోయిన అంశం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యాహ్నం ఉద్యోగులతో చర్చించిన అంశాలను అనంతరం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తాం."అని మంత్రి బొత్స తెలిపారు.
బొత్స సత్యనారాయణ
పీఆర్సీ అంశంపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలను చర్చించిన ఇరుపక్షాలు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ చర్చించనున్నాయి. అయితే అంతకంటే ముందు ఈ రోజు ఉదయం 10 గంటలకు పీఆర్సీపై ఆర్థిక శాఖ అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. హెచ్ఆర్ఏ శ్లాబులు, పీఆర్సీ తదితర అంశాలపై వారితో సమాలోచనలు చేస్తోంది. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
"శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం. ఈ మధ్యాహ్నం మళ్లీ చర్చిస్తాం. హెచ్ఆర్ఏ శ్లాబుల గురించి ఈ రోజు సమాలోచనలు చేస్తాం. ఐఆర్ రికవరీ విషయంలో వారికి స్పష్టత ఇచ్చాం. దీని వల్ల రూ.6 వేల కోట్ల భారం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ అనేది ముగిసిపోయిన అంశం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యాహ్నం ఉద్యోగులతో చర్చించిన అంశాలను అనంతరం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తాం." అని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
ఉద్యోగ సంఘాల నేతలకు, రాష్ట్ర మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఉద్యోగులు తమ డిమాండ్లను మంత్రుల కమిటీ ముందు ఉంచారు. అయితే సూత్రప్రాయంగా ఒప్పుకుని కొన్ని కీలక ప్రతిపాదనలు వారి ముందుంచింది. ముఖ్యంగా ఐఆర్ రికవరీ చేయబోమని, ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. అయితే హెచ్ఆర్ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్ పెంపు, సీపీఎస్ రద్దు లాంటి అంశాలపై వారి నుంచి స్పష్టమైన హామీ రాలేదు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన చర్చలు సుదీర్ఘంగా అర్ధరాత్రి దాటి ఒంటిగంట వరకు జరిగాయి.