AP High court: ప్రైవేట్ బడుల్లో 25 శాతం ఉచిత నిర్బంధ విద్య జీవోలను తప్పు పట్టిన ఏపీ హైకోర్టు
24 June 2024, 14:50 IST
- AP High court: ఆంధప్రదేశ్‌లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలు చేసే క్రమంలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఉచితంగా అందించాలనే జీవోలను ఏపీ హైకోర్టు తప్పు పట్టింది.
ఏపీ హైకోర్టు
AP High court: విద్యాహక్కు చట్టం 25 శాతం ఉచిత సీట్లపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సైతం 25శాతం సీట్లను ఉచిత నిర్బంధ విద్యకు కేటాయించాలన్న జీవోలను తప్పు పడుతూ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు గత ప్రభుత్వ జీవోలు తొందరపాటు చర్యగా అభిప్రాయపడింది.
2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గత ప్రభుత్వం ఉచిత సీట్లు కల్పించాలని జీవోలను జారీ చేసింది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో సైతం 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని జీవోలు జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందని పాఠశాలల్లో సీట్లు కేటాయించాలనే నిబంధనలు సవాలు చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేట్ పాఠశాలల సంఘం, ఇస్మా దాఖలుచేసిన సంయుక్త పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది.విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని సూచించింది. ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం తగదని అభిప్రాయపడింది.