Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఏపీ హైకోర్టులో ఊరట, 2014 నాటి కేసు కొట్టివేత
25 July 2023, 20:49 IST
- Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చిరంజీవిపై 2014లో నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టివేసింది.
చిరంజీవి
Chiranjeevi : సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2014లో కాంగ్రెస్ నేతగా చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఓ వ్యక్తి గుంటూరులో చిరంజీవిపై కేసు పెట్టారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
2014 నాటి కేసులో ఊరట
మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యి 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభ ఎంపీ అయిన చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. అయితే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన చిరంజీవి... పూర్తిగా సినిమాలకే అంకితం అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్న చిరంజీవి...ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిందని, చిరంజీవి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని 2014లో గుంటూరు పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అభియోగాలు నిరూపించలేకపోవడంతో హైకోర్టు చిరంజీవిపై నమోదు అయిన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.