తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court : జర్నలిస్ట్‌పై సిఐడి కేసు కొట్టేసిన ఏపీ హైకోర్టు….

AP High Court : జర్నలిస్ట్‌పై సిఐడి కేసు కొట్టేసిన ఏపీ హైకోర్టు….

HT Telugu Desk HT Telugu

03 December 2022, 8:17 IST

google News
    • AP High Court  వాట్సాప్‌ సందేశాలను ఫార్వార్డ్ చేసినందుకు  సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. గన్నవరం విమానాశ్రయంలో  అక్రమ బంగారం తరలింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల ప్రమేయం ఉందంటూ వాట్సాప్ సందేశాలను ఫార్వార్డ్ చేసినందుకు  వెటరన్‌ జర్నలిస్టుపై సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి నమోదు చేసిన అభియోగాలు కేసులో వర్తించవంటూ ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. 
జర్నలిస్టుపై కేసును కొట్టేసిన హైకోర్టు
జర్నలిస్టుపై కేసును కొట్టేసిన హైకోర్టు

జర్నలిస్టుపై కేసును కొట్టేసిన హైకోర్టు

AP High Court వాట్సాప్‌ సందేశాన్ని ఫార్వార్డ్‌ చేసిన జర్నలిస్ట్ విషయంలో ఏపీ సిఐడి అత్యుత్సాహానికి హైకోర్టు బ్రేకులు వేసింది. విజయవాడకు చెందిన వెటరన్ జర్నలిస్ట్‌‌ అంకబాబుపై నమోదు చేసిన అభియోగాలు చెల్లవని కేసును కొట్టేసింది. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు ఆయన విషయంలో వర్తించవని స్పష్టం చేసింది. రెండు వర్గాల మధ‌్య విద్వేషం రేకెత్తించే ప్రస్తావన ఏది వాట్సాప్ సందేశాల్లో లేదని తేల్చింది. పిటిషనర్‌ మెసేజీని పార్వార్డ్ చేయడం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి, ఇతరులకు దురభిప్రాయం కలగిందని భావించినా, ఈ కేసులో సెక్షన్ 153ఏ, 505ఏ లువర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. సిఎం కార్యాలయ సిబ్బందిపై దురభిప్రాయం కలిగించడం, సమాజంలో రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని కలిగించడం కిందకు రాదని స్పష్టం చేసింది.

రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని రేకెత్తించారని భావించినా సిఐడి నమోదు చేసిన సెక్షన్లు తాజా కేసుకు వర్తించవన్నారు. రెండు మతాలు, జాతులు, తెగల మధ్య శతృత్వాన్ని పెంచిన వ్యవహారాల్లో మాత్రమే అయా సెక్షన్లు వర్తిస్తాయన్నారు. సెక్షన్ 153ఏ, సెక్షన్ 505ఏ జర్నలిస్ట్‌ వాట్సాప్ పోస్టుల వ్యవహారంలో వర్తించవన్నారు. ఆ రెండు సెక్షన్లు వర్తించకపోతే సెక్షన్ 120 బి వర్తించే అవకాశం ఉండదన్నారు. సిఐడి నమోదు చేసిన సెక్షన్లలో హేతుబద్దత లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్లు జస్టిస్ రఘునందన్ రావు తీర్పు వెలువరించారు.

వాట్సాప్ సందేశాలపై కేసు నమోదు….

విద్వేషపూరిత సమాచారాన్ని నిరోధించే విషయంలో నమోదు చేయాల్సిన సెక్షన్లను జర్నలిస్ట్ వాట్సాప్ ఫార్వార్డ్‌ మెసేజీలపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో సిఎంఓలోని ముఖ్యమైన అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టులను 73ఏళ్ల జర్నలిస్ట్ ఫార్వార్డ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న తిరుపతి రమేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 73ఏళ్ల వెటరన్ జర్నలిస్ట్‌పై కేసు నమోదు చేశారు. సిఐడి నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ అంకబాటు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

జర్నలిస్ట్‌ వాట్సాప్ సందేశాల్లో రెండు వర్గాల మధ్య విద్వేషాలు తలెత్తే అవకాశమే లేదని, పిటిషనర్‌పై అలాంటి నేరాన్ని అపాదించడానికి వీల్లేదని, ఫిర్యాదులోని ఆరోపణలు, రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న అంశాలు సిఐడి నమోదు చేసిన సెక్షన్ల పరిధిలోకి రావని పేర్కొన్నారు. 120బి కింద నమోదు చేయడం చెల్లుబాటు కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోడానికి న్యాయస్థానం అయిష్టత చూపుతుందని, సెక్షన్ 153ఏ, 505ఏ కింద నేరారోపణలు ఎదురైతేనే 120బి నమోదు చేయాల్సి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు పలు కేసుల్లో స్పష్టతనిచ్చిందని హైకోర్టు తెలిపింది.

రెండు వర్గాల మధ్య విద్వేసాలు రెచ్చగొట్టేలా నిందితులు మాట్లాడినట్లు మాటలు, రాతపూర్వకంగా, ఇతర పద్ధతుల్లో మతాలు, కులాలు, తెగలు, గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టు స్పష్టమైన ఆధారాలు ఉండాలని తేల్చింది. మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఏవి ఈ కేసులో లేవని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా మతాలు, కులాలు, తెగల మధ్య శతృత్వానికి దారి తీసేలా వ్యాఖ్యలు చేసినపుడే అయా సెక్షన్లు వర్తిస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది.

తదుపరి వ్యాసం