TTD Posts : టీటీడీలో కీలక పదవుల భర్తీకి కసరత్తు, ఆశావహులు ప్రయత్నాల ముమ్మరం
26 November 2024, 15:54 IST
TTD Posts : టీటీడీలో కీలక పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎస్వీబీసీ ఛైర్మన్, ఎస్వీఈటీఏ ఛైర్మన్, ఎస్‌వీబీసీ చైర్మన్ పదవితో పాటు ఎస్‌వీబీసీ సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవుల కోసం కూటమి పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు.
టీటీడీలో కీలక పదవుల భర్తీకి కసరత్తు, ఆశావహులు ప్రయత్నాల ముమ్మరం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కీలక పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పదవులను సొంతం చేసుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
టీటీడీ అనుబంధ విభాగాలుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) ఛైర్మన్, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్‌వీఈటీఏ) చైర్మన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ రెండు విభాగాలు టీటీడీలో కీలకమైన పదవులుగా ఉన్నాయి. వాటి కోసం పలువురు ఆశావహులు పావులు కదుపుతున్నారు. అలాగే ఎస్‌వీబీసీ చైర్మన్ పదవితో పాటు ఎస్‌వీబీసీ సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవుల భర్తీ కోసం కూడా కసరత్తు జరుగుతోంది.
ఎస్‌వీబీసీ ఛానల్ ప్రారంభమైన తరువాత 2018 ఏప్రిల్ 21న సినీ దర్శకుడు రాఘవేంద్రరావును అప్పటి టీడీపీ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సినీనటుడు పృథ్వీకి ఆ పదవి కట్టబెట్టింది. అయితే ఆయన వివిధ వివాదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. ఆ తరువాత వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర ఎస్‌వీబీసీ చైర్మన్ బాధ్యతలను చేపట్టారు.
దాదాపు మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో పాటు సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్‌వీబీసీ చైర్మన్ పదవితో పాటు సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవుల కోసం పలువురు ఆసక్తి చూసుతున్నారు. త్వరలో ఈ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వ ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్‌వీఈటీఏ) చైర్మన్ కోసం పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు, అర్చకులకు ఎస్‌వీఈటీఏ కేంద్రంగానే శిక్షణ ఇస్తుంటారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు, రిటైర్డ్ లెక్చరర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ పదవిలో ఉన్నారు.
అయితే ప్రభుత్వం మారడంతో ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఎస్‌వీఈటీఏ డైరెక్టర్ పదవి కోసం రెండు సంవత్సరాల ప్రాతిపదికన నియమించేలా దరఖాస్తులు కోరుతూ ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. కొత్తగా పలు నిబంధనలు జోడించారు. కొత్త నిబంధనల మేరకు భర్తీ చేస్తారా? లేక పాత విధానంలోనే భర్తీ చేస్తారా? అనే అంశంపై ఆశావహుల్లో చర్చ జరుగుతోంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు