Red Sandal : ఏపీలో సీజ్ చేసిన ఎర్రచందనం విలువ 3 వేల కోట్లు!
21 December 2022, 10:27 IST
- Red Sandal In Andhra Pradesh : ఏపీలో ఎప్పుడూ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న అధికారులు అని వింటూనే ఉంటాం. అలా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఈ వేలం నిర్వహించి కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ఎర్రచందనం
ఏపీ ప్రభుత్వం(AP Govt) స్వాధీనం చేసుకున్న 5,700 టన్నుల ఎర్రచందనం దుంగలను ఈ-వేలం(E Auction) నిర్వహించి సుమారు రూ.3,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కట్టుదిట్టమైన కాపలా ఉన్న గోడౌన్లలో ఉన్న ఈ దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీ, పోలీసు శాఖలు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఈ-కామర్స్ సేవలలో పాలుపంచుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన MSTC లిమిటెడ్ ద్వారా ఈ వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎర్రచందనం(Red Sandal) చెట్లు రాయలసీమ ప్రాంతం, నెల్లూరు జిల్లా అడవులలో కనిపిస్తాయి. ఈ చెట్ల కలపకు ఆసియా అంతటా, ముఖ్యంగా చైనాలో అధిక డిమాండ్ ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధరలు పలుకుతుంది. అందుకోసం స్మగ్లర్లు ఈజీ మనీ కోసం ఎర్రచందనం వైపు చూస్తుంటారు.
తిరుపతి(Tirupati)లోని ఎనిమిది గోడౌన్లలో 5,600 టన్నుల దుంగలు ఉన్నాయి. కపిలతీర్థం గోడౌన్‌లో మరో 100 టన్నులు నిల్వ ఉన్నాయి. ఈ స్టోరేజ్ పాయింట్లకు APSP బెటాలియన్ సిబ్బంది రక్షణగా ఉన్నారు. ఎప్పుడూ CCTV నిఘాలో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి సమస్య లేదు. వీటిని వేలం వేసి భారీగా డబ్బులు సమీకరించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ఏ గ్రేడ్(A Grade) ఎర్రచందనం 800 టన్నులు, బి గ్రేడ్ 1,730 టన్నులు, సి గ్రేడ్ 2,900 టన్నుల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014-15, 2018–19 మధ్య మూడు రకాల దుంగలను విక్రయించిందని సమాచారం. రూ.505 కోట్లు, ఆ తర్వాత రూ.1,666 కోట్లు ఆర్జించినట్టుగా తెలుస్తోంది. అయితే, వివిధ కారణాల వల్ల, ప్రధానంగా కొవిడ్-19, కేంద్ర అధికారుల నుండి అనుమతులు పొందడంలో జాప్యం కారణంగా కొన్ని సంవత్సరాలుగా వేలం నిర్వహించలేదు.
ఇప్పుడు, స్వాధీనం చేసుకున్న దుంగలను వేలం వేయడానికి, ఎగుమతి(Export) చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ నుండి అవసరమైన అనుమతులను పొందింది. అవసరమైన అనుమతులు వచ్చినందున.. ఈ వేలం కోసం చూస్తున్నట్టుగా ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు.