తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees Da: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్

AP Govt Employees DA: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్

22 October 2023, 6:32 IST

google News
    • DA For AP Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఏపీ సర్కార్. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్
డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్

డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్

DA For AP Govt Employees : దసరా పండగ వేళ... ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉద్యోగులకు డీఏను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ 3.64 శాతం ఇవ్వా­లని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... 2022 జులై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

డీఏ నిధులను నవంబరు జీతంతో పాటు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం పేర్కొంది. ఈనెల వరకు ఉన్న బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాకు 3 విడతల్లో చెల్లిస్తామని వివరించింది. సీపీఎస్‌ ఉద్యోగులకు 10శాతం ఎరియర్లు మినహాయించి డీఏ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.

మరోవైపు సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీపీఎస్ రద్దు అసాధ్యమని తేల్చిచెప్పిన ప్రభుత్వం... ఓపీఎస్ స్థానంలో జీపీఎస్(గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్) రూపొందించింది. జీపీఎస్ బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. జీపీఎస్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీపీఎస్ పై ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

జీపీఎస్ ద్వారా మూలవేతనంలో 50 శాతం మేర పింఛన్ చెల్లించేలా టాప్‌ అప్‌ మొత్తాన్ని కలుపుతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు యాన్యూటీ మొత్తం తగ్గితే కనీస పింఛన్ రూ.10 వేలు చెల్లించేలా టాప్‌ అప్‌ కలిపి మొత్తం చెల్లిస్తామని బిల్లులో పేర్కొంది. దీంతో పాటు డీఆర్‌ కూడా ప్రకటించింది. 60 శాతం ఇచ్చే స్పౌజ్‌ పింఛన్ తగ్గిన మొత్తాన్ని భర్తీచేస్తామని ప్రభుత్వం జీపీఎస్ లో స్పష్టంచేసింది. అయితే జీపీఎస్‌ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలు పొందేందుకు పదవీ విరమణ చేస్తే కనీసం పదేళ్ల సర్వీస్ చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఒకవేళ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే కనీసం 20 ఏళ్ల సర్వీసు ఉండాలని పేర్కొంది.

ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదవీ విరమణ ఆదేశాలు ఇస్తే కనీసం 33 ఏళ్ల సర్వీస్ ఉండాలని జీపీఎస్ లో పేర్కొంది. అయితే సీపీఎస్‌ ఉద్యోగులు నిర్దేశిత వ్యవధిలో జీపీఎస్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాన్‌ అకౌంట్ నుంచి ఉద్యోగి తీసుకున్న పాక్షిక, తుది విత్ డ్రాల ఆధారంగా జీపీఎస్‌లో తగ్గింపు ఉండనుంది. అయితే జీపీఎస్ లోని పలు నిబంధనలకు అనుగుణంగా టాప్‌ అప్‌ కాంపొనెంట్‌ లేదా కొంత భాగాన్ని నిలుపుదల చేయడానికి లేదా ఉపసంహరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. జీపీఎస్ పై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు జీపీఎస్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఉద్యోగ సంఘాలు జీపీఎస్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుండా జీపీఎస్ బిల్లు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై పలు ఉద్యోగ సంఘాలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. సీపీఎస్ రద్దుపై జీపీఎస్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఉద్యోగులకు తేల్చిచెప్పింది. జీపీఎస్ లో ఏమైనా మార్పులు ఉంటే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఓపీఎస్ తరహాలో జీపీఎస్‌లోను ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

తదుపరి వ్యాసం