YSR Arogyasri : ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపు ….
29 November 2022, 13:53 IST
- YSR Arogyasri రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి
YSR Arogyasri రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతుండటంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం, రాష్ట్రంలోని రహదారుల మీదగా ప్రయాణించే సమయంలో జరిగే ప్రమాదాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తుండటంతో వారికి చికిత్స అందించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రాష్ట్రంతో సంబంధం లేకుండా చికిత్స అందించాలని ఉత్తర్వలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడే ఇతర రాష్ట్రాల క్షతగాత్రులకు కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది.
రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది తొలి పదినెలల్లోనే ప్రమాదాల్లో 5800మంది చనిపోయారు. ప్రమాదాలు, మరణాలను 15 శాతం తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో చేపట్టాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో దిద్దబాటు చర్యలు ప్రారంబించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురవుతోన్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్‌లు, రోజువారీ కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మార్గదర్శకాలను జారీ చేశారు.
ఇకపై రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే ఇతర రాష్ట్రాల వ్యక్తులకు సీఎంసీవో కార్డును జారీ చేయడం ద్వారా నగదు రహిత చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించనుంది. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టాలని ఆరోగ్యశ్రీ సీఈవో, రవాణా శాఖ కమిషనర్‌లను ఆదేశించారు.