AP Free Gas Cylinders Scheme : ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఇవే
23 October 2024, 15:55 IST
AP Free Gas Cylinders Scheme : ఏపీ ప్రభుత్వం మహిళలకు దీపావళి కానుకగా 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకానికి ఇవాళ మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఈ పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఇవే
ఏపీ ప్రభుత్వం దీపం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ఇవాళ జరుగుతున్న కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనున్నారు. దీపం పథకం ద్వారా అర్హులైన వారికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఉచిత సిలిండర్ల పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఉచిత సిలిండర్ల పథకానికి అవసరమయ్యే పత్రాలు
ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లబ్దిదారులు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నెటివిటీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. దీపం పథకం కింద 3 సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అధికారులు సూచించిన విధంగా లబ్దిదారుల పేరు, చిరుమానా, ఇతర పత్రాలను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వివరాలను పరిశీలించి, అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతానికి దీపం పథకం ద్వారా కనెక్షన్ తీసుకున్న వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలు సీకేవైసీ చేశాయి. దీంతో అర్హుల వివరాలు ప్రభుత్వం వద్దకు చేయాయి. బీపీఎల్ ఫ్యామిలీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సమాచారం.
దీపం పథకం అర్హతలు
- దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందేందుకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి.
- బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి.
- తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి.
- గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఆడపడుచులందరికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అని ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్లదారులు మాత్రమే దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందుతారని నిబంధనలు పెట్టారు. దీంతో పాటు లబ్దిదారులు ముందుగా డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్ ను ప్రభుత్వం జమచేస్తుంది. ఇందుకోసం లబ్దిదారులు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నేడు కేబినెట్ ఆమోదం
ఇవాళ జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీపం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏడాదికి మూడు చొప్పున ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలపనుంది.
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2684 కోట్ల అదనపు భారం పడనుంది. ఐదేళ్లలో రూ.13,423 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.