AP Ration cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం,కొత్త కార్డులపై కీలక అప్డేట్…సూపర్ సిక్స్ హామీతో లింక్
AP Ration cards: ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం జరిగే క్యాబినెట్‌లో కొత్త కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.కూటమి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికం కానున్నాయి.
AP Ration cards: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో లబ్దిదారులను గుర్తించడానికి కూడా రేషన్ కార్డుల్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలకు త్వరలోకొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
మరోవైపు ఏపీలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం డిబిటి పథకాలను అందుకుంటున్న కుటుంబాల సంఖ్యలో హేతుబద్దీకరణ చేయాలనే డిమాండ్ ఉంది. గత ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డులను జారీ చేశారు. అనర్హులకు కూడా కార్డులు మంజూరు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్డుల తనిఖీ కూడా చేపట్టనున్నారు.
ఆరు సూత్రాల ప్రాతిపదికగా వైసీపీ హయంలో లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అంగన్ వాడీలు, పారిశుధ్య కార్మికులకు రేషన్ కార్డుల్ని తొలగించారు. వారికి రేషన్ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది.
ఇప్పటికే వినియోగంలో ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం అక్టోబర్ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తైన నేపథ్యంలో ఎన్నికల హామీలను నేరవేర్చడంపై కూటమి పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల జారీతో పాటు పౌర సరఫరాల శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని కూడా క్యాబినెట్ భేటీలో ప్రాధాన్యాంశంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తేలనున్న రేషన్ వాహనాల భవితవ్యం…
వైసీపీ హయంలో రేషన్ పంపిణీ కోసం ఎండియూ వాహనాలను ద్వారా రేషన్ సరకుల పంపిణీపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. 6 వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయన్నారు.
ప్రతి రేషన్ దుకాణానికి కనీసం 650-750 కార్డులు ఉండేలా కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా కార్డుల జారీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల చేర్పు, కుటుంబ సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం వంటి కార్యక్రమాన్ని చేపడతారు. ఈనెల 10 తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో కొత్త కార్డులపై నిర్ణయం తీసుకుంటారు.