AP Free Gas Cylinders 2024 : దీపావళికి దీపం పథకం ప్రారంభం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే!
AP Free Gas Cylinders Scheme 2024 : ఏపీ ప్రభుత్వం దీపావళికి 'దీపం పథకం' ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అక్టోబర్ 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పీఎం ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు ఈ స్కీమ్ ద్వారా సిలిండర్లు అందిస్తారు.
3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీపం పథకం ఏపీ చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆడ పడుచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి 4 నెలల వ్యవధిలో అర్హులైన కుటుంబాలకు మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి, అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.
అక్టోబర్ 24 నుంచి బుకింగ్
దీపావళి(అక్టోబర్ 31) నుంచి ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభమవుతుంది. అయితే అక్టోబర్ 24 నుంచే సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. లబ్దిదారులు ముందుగా నగదు చెల్లి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. 2 రోజుల వ్యవధిలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమ చేస్తారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో దీపం పథకం తెచ్చామని, ఇప్పుడు మళ్లీ ఉచిత సిలిండర్ల పథకం అమలుచేస్తున్నామన్నారు.
దీపావళి రోజునే దీపం పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.2,684 కోట్ల భారం పడనుంది. పీఎం ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన వారికి మాత్రమే దీపం పథకంలో 3 సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. మిగతా వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఉజ్వల యోజన లబ్దిదారులకు దీపం పథకం సులభంగా వర్తిస్తుందన్నారు.
అర్హతలు
దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందేందుకు తగిన అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి.
తెల్లరేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు.
గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
బీపీఎల్ కుటుంబాలు మాత్రమే అర్హులు
అవసరమయ్యే పత్రాలు
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లబ్దిదారుల ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, స్థానికత సర్టిఫికెట్ అవసరం. దీపం పథకం కింద 3 సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు సూచించిన విధంగా లబ్దిదారుల పేరు, చిరుమానా నమోదు చేయాలి. ఇతర డాక్యుమెంట్స్ ఫొటోలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారులు వివరాలను పరిశీలించి, అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తారు.
సంబంధిత కథనం